Share News

DPO OFFICE : ఉద్యోగోన్నతి ఉండదా..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 12:26 AM

జిల్లాలో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా పని చేస్తున్న వారు అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వారిపాలిట శాపంగా మారింది. జిల్లాలోని 31 మండలాల్లో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా 497 మంది పనిచేస్తున్నారు. వీరికి 2016కు ముందు సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సీనియార్టీ జాబితా తయారు చేయని కారణంగా అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోలేదు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో పలువురు కొత్తగా గ్రేడ్‌-4 పంచాయితీ సెక్రటరీలుగా ఎంపికయ్యారు. కానీ పాతవారికి మాత్రం ఎనిమిదేళ్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంలేదు....

DPO OFFICE : ఉద్యోగోన్నతి ఉండదా..!
District Panchayath office

గ్రేడ్‌-4 సెక్రటరీలకు అన్యాయం

ఎనిమిదేళ్లుగా ప్రమోషన్లు లేవు

అనంతపురం న్యూటౌన, ఆగస్టు 10: జిల్లాలో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా పని చేస్తున్న వారు అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వారిపాలిట శాపంగా మారింది. జిల్లాలోని 31 మండలాల్లో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీలుగా 497 మంది పనిచేస్తున్నారు. వీరికి 2016కు ముందు సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సీనియార్టీ జాబితా తయారు చేయని కారణంగా అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోలేదు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో పలువురు కొత్తగా గ్రేడ్‌-4 పంచాయితీ సెక్రటరీలుగా ఎంపికయ్యారు. కానీ పాతవారికి మాత్రం ఎనిమిదేళ్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంలేదు.


అవగాహన ఉన్నా..

జిల్లా పంచాయతీ అధికారిగా ఇతర డిపార్ట్‌మెంట్ల నుంచి డెప్యుటేషనపై వచ్చిన వారే ఎక్కువగా ఉంటున్నారు. గడిచిన నాలుగేళ్లుగా సొంత డిపార్ట్‌మెంట్‌ వారే జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్నా, సిబ్బంది సంక్షేమం గురించి ఆలోచించలేదన్న విమర్శ ఉంది. డీఎల్‌పీఓలుగా ఉన్నవారు ఇనచార్జి డీపీఓలుగా ఉంటున్నారు. ప్రస్తుత డీపీఓ ప్రభాకర్‌ రావు కూడా ఇక్కడికి ఇనచార్జి డీపీఓగానే వచ్చారు. ఆ తరువాతే ఉద్యోగోన్నతి పొందా రు. ఆయనకు శాఖాపరంగా అన్ని అంశాల్లో పట్టు ఉంది. కానీ సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మోక్షం ఎన్నడో..

ఇప్పటి వరకు గ్రేడ్‌-1 కార్యదర్శుల సీనియార్టీ జాబితా తయారు చేసి, అందుకు అనుగుణంగా అర్హులకు ఈఓఆర్డీలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అనంతరం గ్రేడ్‌-2 సెక్రటరీలకు కూడా ఉద్యోగోన్నతి కల్పించి గ్రేడ్‌-1 సెక్రటరీలుగా నియమించారు. ఇక గ్రేడ్‌-3, గ్రేడ్‌-4 సెక్రటరీల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే.. జిల్లా పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని చెబుతున్నారు. తగిన సంఖ్యలో గుమాస్తాలు లేకపోవడం, ఉన్న వారు వ్యక్తిగత కారణాలరీత్యా దీర్ఘకాలిక సెలవుల్లో ఉండటంతో అధికారులు ఏ పని చేపట్టాలన్నా ఒక అడుగు ముందుకు వేస్తే మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా పరిస్థితి మారుతోంది. జిల్లా మొత్తం 31 మండలాల్లో పని చేసే సిబ్బంది వ్యవహారాలు చూడడానికి జిల్లా పంచాయతీ కార్యాలయంలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్స్‌, ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్స్‌ ఉన్నారు. వీరందరూ పరిపాలన సౌలభ్యానికి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడానికే పరిమితమౌతున్నారు. ఇక సిబ్బంది సంక్షేమం గురించి ప్రత్యేకంగా పట్టించుకోనే తీరిక వారికి లేకపోవడంతో గ్రేడ్‌-4 పంచాయతీ సెక్రటరీల ఉద్యోగోన్నతులకు మోక్షం కనిపించడంలేదు. సీనియార్టీ జాబితా తయారీకి ప్రత్యేక సిబ్బందిని కేటాయించి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

న్యాయం చేస్తాం..

ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితా తయారు చేయించాలి. ఇదో పెద్ద ప్రక్రియ. ఇప్పటికే కొన్ని కేటగిరీలకు పూర్తి చేశాం. అందుకు అనుగుణంగా ఉద్యోగోన్నతులను కల్పించాం. ఇంకా కొన్ని కేటగిరీల వాళ్లు ఉన్నారు. వారికి సీనియార్టీ జాబితా తయారు చేయాలి. ఇప్పటి వరకు ఎంతవరకు పూర్తి అయిందన్న వివరాలు పరిశీలించి, ఆ ప్రక్రియను కూడాపూర్తి చేసి వారికి ఉద్యోగోన్నతి కల్పిస్తాం. - ప్రభాకర్‌రావు, డీపీఓ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 12:26 AM