POLICE SPORTS MEET: సందడే.. సందడి..
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:20 AM
జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్‌తో పరేడ్ మైదానంలో ఎటుచూసినా సందడే సందడి. ఎస్పీ రత్న సైతం పలు క్రీడాంశాల్లో పోటీపడి, ఉత్సాహం నింపారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీల మధ్య పరుగు పందెం నిర్వహించారు.
పలు క్రీడాంశాల్లో పోటీపడిన ఎస్పీ
ఏఎస్పీ, డీఎస్పీల మధ్య పరుగు పందెం
పుట్టపర్తిరూరల్, డిసెంబరు 20(ఆంద్రజ్యోతి): జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్‌తో పరేడ్ మైదానంలో ఎటుచూసినా సందడే సందడి. ఎస్పీ రత్న సైతం పలు క్రీడాంశాల్లో పోటీపడి, ఉత్సాహం నింపారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీల మధ్య పరుగు పందెం నిర్వహించారు. దీంతో పోటీల మూడోరోజు శుక్రవారం కోలాహలంగా సాగింది. పోటీలు ముగియడంతో విజేతలకు సాయంత్రం బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజేతలకు బహమతులు అందజేసిన అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదన్నారు. ఇలాంటి క్రీడాపోటీలతో నూతనోత్సాహం వస్తుందన్నారు. అంతేకాకుండా సిబ్బంది మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు.
ఓవరాల్ చాంపియన ఏఆర్ జట్టు
క్రీడాపోటీల్లో ఏఆర్ జట్టు ఓవరాల్ చాంపియనగా అవతరించింది. స్పోర్ట్స్ మీట్ ఓవరాల్ చాంపియనగా మహిళా విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ హేమలత, పురుషుల విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ నిలిచారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పోలీసు స్పోర్ట్స్ మీట్ ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పౌరాణికం, భరతనాట్యం తదితరాలను ప్రదర్శించారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు గానంతో అలరింపజేశారు. సాంస్కృతిక కార్యక్రమ విజేతలకు జిల్లా అదనపు న్యాయాధికారి శైలజ, ఎస్పీ రత్న బహుమతులు అందజేశారు.
పాటపాడిన న్యాయాధికారి, ఎస్పీ
సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అదనపు న్యాయాధికారి శైలజ, ఎస్పీ రత్న పాట పాడి, అలరించారు. అనంతరం న్యాయాధికారి మాట్లాడుతూ.. పోలీసు వృత్తి ఎంతో గౌరవమైనదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎన్నో త్యాగాలు చేస్తుంటారన్నారు. ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు విజయ్‌కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కేవీ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.