Share News

YCP : నోటీస్‌.. గీటీస్‌.. జాన్తానై!

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:56 PM

వైసీపీ రియల్టర్లు బరితెగించారు. నిబంధనలు తుంగలో తొక్కి లే అవుట్‌ వేశారు. పంచాయతీ అవసరాలకు స్థలం ఇవ్వాల్సి ఉండగా అది వదలేదు. మరో వైపు ల్యాండ్‌ కన్వర్షన జరగలేదు. అహుడా అనుమతులు తీసుకోలేదు. అయినా లేఅవుట్‌ వేయడంతో పాటు ప్లాట్లు వేసి దర్జాగా విక్రయించేశారు. ఇందుకు రిజిస్ట్రేషన అధికారులు యథాశక్తి సహకరించడంతో ఆ రియల్టర్ల పని మరింత సులువుగా జరిగి పోయింది. ...

YCP : నోటీస్‌.. గీటీస్‌.. జాన్తానై!
With the flexi removed, Prahari looks empty

వైసీపీ రియల్టర్ల బరితెగింపు..!

నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్‌

పంచాయతీ, అహుడా అధికారుల నోటీసులు, ఫ్లెక్సీల తొలగింపు

కొనుగోలుదారులకు 18 ప్లాట్ల రిజిస్ట్రేషన

మిన్నకుండిపోయిన అహుడా, పంచాయతీ అధికారులు

అనంతపురంరూరల్‌, జూలై14: వైసీపీ రియల్టర్లు బరితెగించారు. నిబంధనలు తుంగలో తొక్కి లే అవుట్‌ వేశారు. పంచాయతీ అవసరాలకు స్థలం ఇవ్వాల్సి ఉండగా అది వదలేదు. మరో వైపు ల్యాండ్‌ కన్వర్షన జరగలేదు. అహుడా అనుమతులు తీసుకోలేదు. అయినా లేఅవుట్‌ వేయడంతో పాటు ప్లాట్లు వేసి దర్జాగా విక్రయించేశారు. ఇందుకు రిజిస్ట్రేషన అధికారులు యథాశక్తి సహకరించడంతో ఆ రియల్టర్ల పని మరింత సులువుగా జరిగి పోయింది. వాస్తవానికి ల్యాండ్‌ కన్వర్షన జరగకుండా లేఅవుట్‌ వేయకూడదు. అంతేకాకుండా పంచాయతీకి స్థలం ఇవ్వకుండా రిజిస్ట్రేషన చేయకూడదని నిబంధనలున్నాయి. దీనికితోడు అహుడా అనుమతులు కూడా ఉండాలి. ఇవేవీ లేకుండానే లేఅవుట్‌ వేసేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు అది అక్రమ లేఅవుట్‌ అంటూ కాంపౌండ్‌కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అహుడా అధికారులు సైతం లేఅవుట్‌కు నోటీసులు అతికించారు. ఈక్రమంలోనే


రిజిస్ట్రేషన అధికారులకు పంచాయతీ, అహుడా నుంచి సమాచారం కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయినా రిజిస్ట్రేషన శాఖ అధికారులు మాత్రం ఇవేవీ లెక్కలోకి తీసుకోకుండా వైసీపీ రియల్టర్లకు లబ్ధిచేకూర్చారు. తమ వద్దకు రిజిస్ట్రేషనకు వస్తే చాలు..అన్నట్లుగా జెట్‌ స్పీడుతో ఆ అనధికార లేఅవుట్‌లోని ప్లాట్లను రిజిస్టర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇది జిల్లా కేంద్రానికి సమీపంలోని అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి పంచాయతీలో జరిగింది.

పంచాయతీ, అహుడా నిబంధనలు తుంగలోకి..

అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ కక్కలపల్లి గ్రామ సర్వే నెంబరు 14-2లో 6.8 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వైసీపీ రియల్టర్లు లేఅవుట్‌ వేశారు. సాధారణంగా అయితే అహుడా అనుమతులు ఉండాలి. అంతకంటే ముందు ల్యాండ్‌ కన్వర్షన చేయించాలి. పంచాయతీకి అవసరాలకు 60.8సెంట్లు స్థలం కేటాయించాలి. ఇవేవీ జరగకుండానే లేఅవుట్‌ వేశారు. విషయం అహుడా, పంచాయతీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈనెల 9న అనధికార లేఅవుట్‌ అంటూ పంచాయతీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అహుడా అధికారులు నోటీసులను లే అవుట్‌ కాంపౌండ్‌కు అతికించారు. వాటిని సదరు వైసీపీ రియల్టర్లు తొలగించేశారు. రిజిస్ట్రేషన అధికారులతో బేరం కుదుర్చుకుని రెండు రోజుల కిందట 18ప్లాట్లు కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన చేయించినట్లు సమాచారం.

చోద్యం చూస్తున్న అహుడా, పంచాయతీ అధికారులు

వైసీపీ నాయకుల ముందు అహుడా, పంచాయితీ అధికారుల పాచికలు పారలేదని తెలుస్తోంది. ఆ అధికారులకు అనధికార లేఅవుట్‌ అంటూ ఫ్లెక్సీలు, నోటీసులు అతికించడానికే సరిపోయింది. ల్యాండ్‌ కన్వర్షన జరిగిందాలేదా చూడాల్సిన రెవెన్యూ అధికారులు ఆవైపు తొంగిచూడలేదు. దీనికి తోడు వైసీపీ రియల్టర్లకు రిజిస్ట్రేషన శాఖ అధికారులు సహకరించడంతో ప్లాట్ల రిజిస్ట్రేషన చకచకా సాగిపోయింది. ఇందుకు సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలోనే ముట్టచెప్పారన్న వాదనలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 14 , 2024 | 11:56 PM