Share News

TRIBUTE TO LENIN: పాలకుల స్వభావం మారితేనే సమసమాజం

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:24 AM

అధికార మార్పిడి జరిగినంత మాత్రాన సమసమాజ స్థాపన సాధ్యం కాదని, పాలకవర్గ స్వభావంలోనే మార్పు రావాలని కేరళ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆచార్య వీకే రామచంద్రన పేర్కొన్నారు.

TRIBUTE TO LENIN: పాలకుల స్వభావం మారితేనే సమసమాజం
VK Ramachandran and left leaders paying tribute at Lenin's portrait

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 29: అధికార మార్పిడి జరిగినంత మాత్రాన సమసమాజ స్థాపన సాధ్యం కాదని, పాలకవర్గ స్వభావంలోనే మార్పు రావాలని కేరళ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఆచార్య వీకే రామచంద్రన పేర్కొన్నారు. లెనిన శతవర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘రాజ్యం-విప్లవం’ అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు రామచంద్రన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో పేద, ధనికుల మధ్య అంతరాలు అనివార్యమని కారల్‌ మార్క్స్‌, లెనిన ఆనాడే తమ రచనల ద్వారా తెలియజేసారని గుర్తుచేశారు. పాలకవర్గాలన్నీ పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకే పనిచేస్తాయని పేర్కొన్నారు. అందుకే ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు అధికమని వివరించారు. స్వాతంత్ర్యానికి పూర్వం సమసమాజ భావనలే అధికంగా ఉండేవన్నారు. క్రమంగా బడా పెట్టుబడి, భూస్వామ్య లక్షణాలు పెరిగాయన్నారు. 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు చేయడం ప్రారంభించాక మరింత వేగవంతమయ్యాయన్నారు. దీనికి మతతత్వం కూడా తోడైందని తెలిపారు. అప్పటి నుంచి ఆర్థిక అంతరాలు మరింతగా పెరుగుతూ పోతున్నాయన్నారు. ప్రతి నలుగురు చిన్నారుల్లో ముగ్గురికి సరైన పౌష్టికాహారం లభించడం లేదని తెలిపారు. కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ అంతరాలు పోవాలంటే పాలకవర్గాల స్వభావం మారాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్‌ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో లెనిన ఆలోచనలను మరోమారు పునరుచ్చరణ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు, ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావి త్రి, డాక్టర్‌ భానుకిరణ్‌, ఎస్‌ఎం బాషా, గోవిందరాజులు, సత్యబోస్‌, నాగేంద్రకుమార్‌, రాజమోహన, రమణయ్య, సతీష్‌, రంగనాయకులు, సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటనారాయణ, రామిరెడ్డి, పరమేష్‌, జ యచంద్ర, శ్రీదేవి, రమకృష్ణారెడ్డి, మనోహర్‌, ఇర్ఫాన, శ్యామల పాల్గొన్నారు.

వయనాడ్‌ బాధితులకు రూ.17వేలు ఆర్థికసాయం: కేరళలోని వయనాడ్‌ వరద బాధితుల సహాయార్థం విద్యార్థుల నుంచి సేకరించిన రూ.17వేల చెక్కును కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ పేరిట కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వీకే రామచంద్రనకు సమాజక్రాంతి చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు లెనినబాబు అందజేశారు. దీనికి వీకే రామచంద్రన స్పందిస్తూ తాను కేరళ ముఖ్యమంత్రిని నేరుగా కలిసి ఈ చెక్కును అందజేస్తానని తెలిపారు.

Updated Date - Sep 30 , 2024 | 12:24 AM