Share News

Surya Ghar కోటి వెలుగులు..!

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:38 PM

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై కేంద్రం దృష్టిపెట్టింది. అందులో భాగంగా విద్యుదుత్పత్తి దిశగా సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజనకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్‌ ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి అవసరాలకు విద్యుతను అక్కడే ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.

Surya Ghar కోటి వెలుగులు..!
గుండుమల గ్రామంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

సూర్యఘర్‌ పథకంతో తప్పనున్న విద్యుత బాధలు

సోలార్‌ పలకల ఏర్పాటుతో ఎన్నో లాభాలు

పంచాయతీకి రూ.కోటి నజరానా

నియోజకవర్గంలో ఒకటి ఎంపిక

హిందూపురం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై కేంద్రం దృష్టిపెట్టింది. అందులో భాగంగా విద్యుదుత్పత్తి దిశగా సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజనకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్‌ ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి అవసరాలకు విద్యుతను అక్కడే ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. పట్టణ, గ్రామీణ స్థాయిల్లో విస్తారంగా ఇళ్లపై సౌరపలకల ఏర్పాటు చేసుకునే వారికి రాయితీలు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జిల్లాల పరిధిలో నియోజకవర్గాల్లో 5వేలకుపైగా జనాభా కలిగిన పంచాయతీలను ఎమ్మెల్యేల ఆమోదంతో మోడల్‌ సేలర్‌ గ్రామాలను ఎంపిక చేస్తున్నారు. దీంతో కిలోవాట్‌ నుంచి 3 కిలోవాట్ల వరకు సామర్థ్యంగల సోలార్‌ప్లాంట్‌ అమర్చుకుంటే రూ.30వేలు, రూ.60వేలు, రూ.70వేలు చొప్పున లబ్ధిదారులకు రాయితీ అందించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటును పోటీ పరిస్థితుల్లో జిల్లాల్లో అత్యధికంగా లక్ష్యం సాధించిన పంచాయతీలకు రూ.కోటి నగదు బహుమతి సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్‌ పంచాయతీని ఎంపిక చేసే పనిలో విద్యుతశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా ఇప్పటికే ట్రాన్సకో అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. నిర్దేశించిన పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. రోజురోజుకీ విద్యుత చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులపై మోయలేని భారం పడుతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ముందుచూపుగా విద్యుతశక్తి పునరుత్పాదనపై దృష్టి సారించింది. ఇళ్ల పైకప్పులపై సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే రెండు భాగాలుగా రాయితీలు ఇవ్వనుంది. రెండు కిలోవాట్ల సామర్థ్యానికి 60 శాతం, అంతకన్నా ఎక్కువైతే 40 శాతం ఇస్తుంది. 3 కేవీ ప్లాంట్‌కు రూ.1.45 లక్షలు ఖర్చవుతుంది. దీనికి గరిష్ఠంగా రూ.78వేలు అందజేస్తుంది. మిగిలిన మొత్తానికి బ్యాంకుక ద్వారా రుణం సమకూర్చేలా భరోసా ఇస్తుంది.

నెలకు 0-150 యూనిట్లు విద్యుత వాడేవారు 1-2 కేవీ వాడేవారు, 150 నుంచి 200యూనిట్లు ఉంటే 2-3 కేవీ సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఇంటిపై గరిష్ఠంగా 3కిలోవాట్లు విద్యుత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఎంతగానో ఆదా..

1 కిలోవాట్‌కు 128 యూనిట్ల విద్యుత ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం నెలకు రూ.వెయ్యి బిల్లు వస్తుంది. సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే రూ.350 మాత్రమే బిల్లు వచ్చే అవకాశ ం ఉంది. ఏడాదికి రూ.8వేలు ఆదా అవుతుంది. 2కేవీ అయితే ఏడాదికి రూ.20 వేలు, 3 కేవీలకు రూ.32 వేలకుపైగా ఆదా చేసుకోవచ్చు. అంతేకాక సోలార్‌ విద్యుతను 300యూనిట్ల దాకా వాడుకోవచ్చు. మిగిలితే నైట్‌ మీటరింగ్‌ కింద విక్రయించవచ్చు. తద్వారా నెలకు రూ.1200 ఆదాయం వస్తుంది. నెలకు రూ.610 రుణం వాయిదా కింద జమ చేసుకోవచ్చు. ఈ లెక్కన తీసుకున్న రుణం ఏడేళ్లలో తీరిపోతుంది. పెద్దపెద్ద అంతస్తులుంటే విద్యుత దీపాలు, వాహనాల చార్జింగ్‌ స్టేషనకు కనెక్షన ఇచ్చుకోవచ్చు.

పంచాయతీల ఎంపిక

జిల్లాలోని హిందూపురం ట్రాన్సకో ఈఈ కార్యాలయం పరిధిలో మడకశిర నియోజకవర్గంలోని గుండుమల పంచాయతీని మోడల్‌ పంచాయతీగా ఎంపిక చేశారు. హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి, పెనుకొండ పరిధిలో సోమందేపల్లి పంచాయలను ఎంపిక చేసినట్లు విద్యుతశాఖ అధికారులు తెలిపారు. వీటి పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటిపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఎంపిక చేసిన గ్రామానికి రూ.కోటి బహుమతి ఇస్తారు. ఆ మొత్తం పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. 5వేలకుపైగా జనాభా కలిగిన పంచాయతీల వారీగా సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని అత్యధిక ఫలితాలు సాధించిన పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి బహుమతి అందజేస్తుంది. వివిధ అభివృద్ధి పనులకు వినియోగించుకునే సౌలభ్యం ఉంది. వ్యక్తిగతంగా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు. పర్యావరణ పరంగా ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మిగులు విద్యుత ఇంట్లోకి ఎన్ని యూనిట్లు వెళ్లిందో దానిని తిరిగి డబ్బుకూడా జమ అవుతుంది. నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలన్న లక్ష్యం దీని ద్వారా పొందవచ్చు.

విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం:

భూపతి, ట్రాన్సకో ఈఈ, హిందూపురం

ఎంపిక చేసిన పంచాయతీల పరిధిలోని వినియోగదారుల ఇల్లు, భవనాలపై సబ్సిడీతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే విద్యుత తయారీలో భాగస్వామ్యం కోసం ప్రోత్సాహకాలు అందిస్తారు. దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పుడిప్పుడే కొంతమందికి దరఖాస్తులు నమోదు చేసుకుంటున్నారు. అంతేకాక సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటులో పూర్తిస్థాయిలో ఏ పంచాయతీ నిలుస్తుందో దానికి కేంద్రప్రభుత్వం రూ.కోటి నిధులు కూడా బహుమతి కింద పంచాయతీలకు జమచేస్తుంది.

Updated Date - Dec 29 , 2024 | 11:38 PM