Share News

PM Viswakarma Yogana ఆశ.. నిరాశ..!

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:59 PM

చేతివృత్తుల వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అమలులో జాప్యం జరుగుతోంది. పథకం ద్వారా శిక్షణతోపాటు రుణ సదుపాయం పొందడానికి దరఖాస్తు చేసుకొని ఏడాది పూర్తయినా ఆర్థిక సాయం అందలేదు.

PM Viswakarma Yogana ఆశ.. నిరాశ..!
జనశిక్షణా సంస్థాన ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న క్షురకులు(ఫైల్‌)

అర్హులకు అందని విశ్వకర్మ పథకం

ఆరంభమై 15 మాసాలు గడిచినా ఫలితం అంతంతే

జిల్లాలో 99178 మంది ఆనలైనలో దరఖాస్తు

32683 దరఖాస్తులు రాష్ట్ర స్థాయికి సిఫార్సు

10 బ్యాచల్లో 300 మందికే శిక్షణ

బ్యాంకు రుణాల సంగతి దేవుడికే ఎరుక !

అనంతపురం అర్బన, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): చేతివృత్తుల వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన అమలులో జాప్యం జరుగుతోంది. పథకం ద్వారా శిక్షణతోపాటు రుణ సదుపాయం పొందడానికి దరఖాస్తు చేసుకొని ఏడాది పూర్తయినా ఆర్థిక సాయం అందలేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

టెక్నికల్‌ సమస్యతో ఆగిపోయిన డేటా

సాంకేతిక సమస్యలతో విశ్వకర్మ పోర్టల్‌లో 11724 మంది లబ్ధిదారుల డేటా ఆగిపోయినట్లు సమాచారం. కామన సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది కొందరు లబ్ధిదారుల దరఖాస్తుల్లో జిల్లా పేరు అనంతపురం అని, మరికొన్ని దరఖాస్తుల్లో జిల్లా పేరు అనంతపూర్‌ అని నమోదు చేశారు. నిబంధనల మేరకు అనంతపురం జిల్లా అని నమోదు చేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా రెండు రకాలుగా జిల్లా పేరు నమోదు చేయడంతో సమస్య ఏర్పడింది. దీని కారణంగా దరఖాస్తుల డేటా ఆగిపోయినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక అధికారులు సంబంధిత రాష్ట్ర, కేంద్ర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిసింది. త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని పరిశ్రమల శాఖ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ అధికారులు పేర్కొంటున్నారు.

రాష్ట్ర స్థాయికి 32683 దరఖాస్తుల సిఫార్సు

గత ఏడాది సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఐదేళ్లపాటు ఈ పథకం అమలులో ఉండేలా నిర్ణయించారు. ఈ పథకం ఆరంభమై 15 మాసాలు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 99178 మంది ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి దాకా సచివాలయాల నుంచి 81526 దరఖాస్తులు అర్హత ఉన్నట్లు జిల్లా స్థాయికి పంపారు. 3693 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 13959 దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి 32683 లబ్ధిదారుల దరఖాస్తులు అర్హత ఉన్నట్లు రాష్ట్ర స్థాయికి సిఫార్సు చేశారు. జిల్లా స్థాయిలో 6517 మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చారు. మరో 42326 లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలనా క్రమంలో పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి 11724 దరఖాస్తులు అర్హత ఉన్నవిగా గుర్తించి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనకు పంపినట్లు సమాచారం. మూడు దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

ఒకే లాగినతో ఇన్నాళ్లు ఇక్కట్లు

సచివాలయాల నుంచి ఆనలైన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ లాగిన నుంచి రాష్ట్ర స్థాయిలో మినిస్ర్టీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ (ఎంఎస్‌డీఈ)కి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనకు డేటా వెళుతుంది. తిరిగి అక్కడి నుంచి అర్హులైన లబ్ధిదారులకు శిక్షణనిచ్చేలా జిల్లా స్కిల్‌డెవలప్‌మెంట్‌కు డేటా వస్తుంది. గత నెల మూడో వారం దాకా జిల్లా కలెక్టర్‌ లాగిన ఒకటే ఉండింది. ఒక్క లాగినతోనే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆనలైనలో వచ్చిన దరఖాస్తులను పరిశ్రమల శాఖ అధికారులు రాష్ట్ర స్థాయికి పంపేవారు. ఒకే లాగిన ఉండటంతో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసేందుకు జాప్యం జరిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పరిశ్రమల శాఖ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో గత నెల ఆఖరివారంలో మరో 4 లాగిన్స సదుపాయాన్ని కల్పించినట్లు సమాచారం. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో ఆశించిన స్థాయిలో దరఖాస్తుల అప్‌లోడ్‌ కావడం లేదన్న విమర్శలున్నాయి.

టైలర్లు, తాపీమేస్ర్తుల దరఖాస్తులపై విచారణ

జిల్లా వ్యాప్తంగా 99178 మంది విశ్వకర్మ పథకానికి ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా టైలర్లు 79121 మంది దరఖాస్తు చేసుకున్నారు. తాపీమేస్ర్తులు 5483, ధోబీ 5447, నాయీబ్రాహ్మణులు 1968, కార్పెంటర్లు 1463, చర్మకారులు 1360 మంది ఉన్నారు. మిగిలిన వారిలో ఇతర కులవృత్తులకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో టైలరింగ్‌, తాపీమేస్ర్తుల శిక్షణ, రుణ సదుపాయం కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకో వడంతో ఆయా దరఖాస్తులపై సచివాలయ సిబ్బందితో విచారణ చేయించారు. కులవృత్తిగా టైలరింగ్‌, తాపీ మేస్ర్తీ పనులు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తించాలని, మిగతా వారిని అనర్హులుగా తేల్చాలని ఆదేశాలు అందాయి. ఆ మేరకు ఈ రెండు కేటగిరిల దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో విచారణ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది టైలరింగ్‌, తాపీమేస్ర్తుల శిక్షణకు దరఖాస్తు చేసుకున్న వారిని అనర్హులుగా తేల్చారు. 79121 మంది టైలరింగ్‌ శిక్షణ, రుణ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. సచివాలయ స్థాయి నుంచి 65017 దరఖాస్తులను జిల్లా స్థాయికి పంపారు. 3316 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలినవి పరిశీనలో ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి 19225 దరఖాస్తులను రాష్ట్ర స్థాయికి పంపారు. 5575 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. తాపీ మేస్ర్తీకి 5483 దరఖాస్తులు రాగా.. సచివాలయ స్థాయి నుంచి 4590 దరఖాస్తులను జిల్లా స్థాయికి పంపారు. 102 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. జిల్లా స్థాయి నుంచి 2559 దరఖాస్తులను రాష్ట్ర స్థాయికి పంపారు. 173 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.

300 మందికే శిక్షణ

విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి శిక్షణనిచ్చి బ్యాంకు రుణాలు ఇప్పించాలని నిర్ణయించారు. అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు పక్షం రోజుల దాకా శిక్షణ నిస్తారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్‌ చెల్లిసారు. ఆ తర్వాత రూ.15వేలు విలువైన టూల్‌ కిట్‌ను ఇంటికే పంపాలని నిర్ణయించారు. అనంతరం బ్యాంక్‌ ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.లక్ష రుణాన్ని అందజేయాలని నిర్ణయించారు. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఇలా సక్రమంగా రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి తిరిగి రెండో విడతలో రూ.2 లక్షలు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని 30 నెలల్లో చెల్లించాలి. బ్యాంకులో రుణం తీసుకున్న చేతివృత్తుల వారికి 5 శాతం వడ్డీని వర్తింపజేస్తారు. ఇలా వృత్తి అభివృద్ధి ఆధారంగా రుణాలు ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే మళ్లీ పెద్ద మొత్తంలో రుణాలు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని జనశిక్షణా సంస్థాన, న్యాక్‌, శ్రీ టెక్నాలజీస్‌ సంస్థలకు చేతివృత్తుల వారికి శిక్షణనిచ్చే బాధ్యతలు స్కిల్‌డెవలప్‌మెంట్‌ సంస్థ అధికారులు అప్పగించారు. గత అక్టోబరు నెల దాకా 10 బ్యాచల్లో 300 మంది బార్బర్లు, చర్మకారులకు శిక్షణనిచ్చారు. ఒక్కో బ్యాచలో 30 మందికి శిక్షణనిచ్చారు. గత నెల నుంచి అర్హులైన లబ్ధిదారుల జాబితా నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన నుంచి అందకపోవడంతో శిక్షణలు ఆగిపోయాయి. పథకం ఆరంభమై 15 నెలలు కావస్తున్నా ఇప్పటి దాకా 10 బ్యాచుల్లో 300 మందికి మాత్రమే శిక్షణనివ్వడంతో సరిపెట్టారు. శిక్షణ తర్వాత ఎంత మందికి బ్యాంక్‌ రుణాలు అందజేశారన్న వివరాలపై స్పష్టత లేదు. బ్యాంక్‌ రుణాల మంజూరుపై ప్రత్యేక పర్యవేక్షణ పెడితేనే లబ్ధిదారులకు ఆశించిన ప్రయోజనం చేకూరుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అర్హులైన వారందరికీ శిక్షణ

విశ్వకర్మ పథకానికి అర్హులైన వారందరికీ శిక్షణతోపాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 99178 మంది ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా స్థాయి నుంచి 32683 మంది లబ్ధిదారుల దరఖాస్తులు అర్హత ఉన్నట్లు రాష్ట్ర స్థాయికి సిఫార్సు చేశాం. మిగతా దరఖాస్తులను పరిశీలించి, అర్హుల దరఖాస్తులను రాష్ట్ర స్థాయికి పంపుతాం. టైలరింగ్‌, తాపీమేసు్త్రలకు శిక్షణ, రుణ సదుపాయం కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వాటిపై సచివాలయ సిబ్బందితో విచారణ చేయించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ చేయించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ విశ్వకర్మ పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటాం.

శ్రీధర్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి

Updated Date - Dec 22 , 2024 | 11:59 PM