AP RYTHU SANGAM: 9 నుంచి గ్రామ, మండల కార్యాలయాల వద్ద నిరసనలు
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:51 PM
జిల్లాలో 2023 ఖరీఫ్, రబీ ఇన్సురెన్స ప్రకటించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో 9 నుంచి 23వ తేదీ వరకు గ్రామ, మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం కల్చరల్, సెప్టెంబరు 4: జిల్లాలో 2023 ఖరీఫ్, రబీ ఇన్సురెన్స ప్రకటించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో 9 నుంచి 23వ తేదీ వరకు గ్రామ, మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక గణేనాయక్ భవనలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్, రబీలో తీవ్రమైన కరువు పరిస్థితులేర్పడ్డాయని, సకాలంలో వర్షాలు రాక వేరుశనగ, శనగ, మిరప, పత్తి తదితర పంటలు పూర్తిగా నష్టం వాటిల్లిందన్నారు. కనీసం పెట్టుబడులు కూడా రాక, చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. తక్షణమే ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలన్నారు. 25వ తేదీన కలెక్టరేట్ ముందు చేపట్టే ధర్నా కార్యక్రమాల్లో రైతులు, కూలీలు, కౌలు రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శివారెడ్డి, విరూపాక్షి, రాజారాంరెడ్డి, శ్రీనివాసులు, నల్లప్ప, సంగప్ప, పోతులయ్య, చిదంబరయ్య, వెంకటకొండ పాల్గొన్నారు.
ఐఏబీ సమావేశం నిర్వహించాలి
అనంతపురం క్లాక్‌టవర్: ఇరిగేషన అడ్వైజరీ బోర్డు(ఐఏబీ) సమావేశం వెంటనే నిర్వహించి, నీటిని విడుదల చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీబీ డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో హెచ్చెల్సీకి నీటిని వదులుతున్నారని, దీంతో ఆయకట్టు రైతులు వివిధ పంటలు సాగుచేశారన్నారు. వెంటనే ఐఏబీ సమావేశం నిర్వహించి జిల్లాలో సాగుచేసిన ఆయకట్టు రైతుల పంటను కాపాడాలని కోరారు.