MRPS: ఎస్సీ వర్గీరణ చట్టం చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:04 AM
ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన ఏర్పాటు చేసి తక్షణమే చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణకు కోర్టులో కేసువేసి గెలిచిన సభ్యులకు శుక్రవారం సత్కార మహాసభను నిర్వహించారు.
అనంతపురం సెంట్రల్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన ఏర్పాటు చేసి తక్షణమే చట్టం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణకు కోర్టులో కేసువేసి గెలిచిన సభ్యులకు శుక్రవారం సత్కార మహాసభను నిర్వహించారు. మాదిగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహంవద్ద ఏర్పాటు చేసిన సభకు అక్కులప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు కృపాకర్ మాదిగ, ఆర్‌జే ప్రకాష్ మాదిగ, లాయర్ గిరిధర్ మాదిగ హాజరయ్యారు. వర్గీకరణ పోరాట ఉద్యమ గళాన్ని గ్రామీణ ప్రాంతాలనుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు వినిపించారని కొనియాడారు. ఈ క్రమంలో ఎంతోమంది వృత్తి, ఉద్యోగ ఆదాయాలు, కుటుంబ జీవితాలను కోల్పోయారని అన్నారు. కల్టెరేట్ వద్ద తెల్లబండ్ల రవి ఆత్మబలిదానం చేశారని గుర్తు చేసుకున్నారు. మాదిగ దండోరా ఉద్యమం ఎమ్మార్పీఎ్‌సగా అవతరించి, వర్గీకరణపై ఉమ్మడి పోరాటాలు చేశామని అన్నారు. దండోరా ఉద్యమం వ్యవస్థలను కదిలించిందని అన్నారు. మాదిగల కోరిక న్యాయమైనదని, తీర్చాల్సిందేనని 1997లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన ప్రభుత్వానికి నివేదించిందని అన్నారు. మాదిగలకు హక్కులను కల్పించాల్సిందేనని మీడియా, రాజకీయపార్టీలు బలపర్చాయని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వర్గీకరపై 2000లో అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారని, మాల సామాజిక ఎమ్మెల్యేలు కూడా ఓటువేశారని గుర్తుచేశారు. మాల సామాజికవర్గంలో పిడికెడు మంది మాత్రమే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అలాంటి వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామి, ఆనంద్, రాజు తదితరులు పాల్గొన్నారు.