Share News

MOHARRAM: భక్తిశ్రద్ధలతో మొహరం

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:57 PM

మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా హిందూ, ముస్లింలు వేడుకను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

MOHARRAM: భక్తిశ్రద్ధలతో మొహరం
Pilgrims marching through the streets of Pathur

అనంతపురం కల్చరల్‌, జూలై 17: మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా హిందూ, ముస్లింలు వేడుకను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు ఉపవాస దీక్ష చేసి, సాయంత్రం నమాజ్‌ అనంతరం దీక్షను విరమించారు. ప్రధానంగా పాతూరు వీధుల్లో పీర్లతో సందడి వాతావరణం నెలకొంది. యువత కేరింతల నడుమ నృత్యాలు చేశారు. పలువురు భక్తులు పానకాలు చేసి పంచారు. ఇమామ్‌, ఖాసీం, హుస్సేన మస్తాన స్వాముల పీర్లను ఊరేగించడంతోపాటు చక్కెర చదివింపులు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

శింగనమల: మొహరం ఉత్సవాలలో భాగంగా బుధవారం చివరి రోజు పీర్ల స్వాములు జలధికి తరలాయి. శింగనమల, గొవిందురాయునిపేట గ్రామాల్లో పీర్ల మాకాం వద్ద మంగళవారం రాత్రి అగ్ని గుండాలు వెలిగించారు. బుధవారం తెల్లవాజమున పీర్లను గ్రామాల్లో ఊరేగించారు. శింగనమల గొల్ల వీధిలో బుధవారం తెల్లవాజమున, సాయంత్రం జరిగే చిన్నవెండిదేవుడు పీర్లు చిన్నఅక్బర్‌స్వామి పీర్ల మధ్య గొడుగుల కోసం జరిగే గొడవ సన్నివేశాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం పీర్లు జలధికి వెళ్లాయి.


బుక్కరాయసముద్రం: కులమతాలకతీతంగా పీర్ల పండుగను బుధవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నాలుగు రోజుల నుంచి మండలకేంద్రంతో పాటు 19 గ్రామ పంచాయతీలలో హిందూ ముస్లింలు కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామాల్లో ఉన్న చావడి వద్ద ఆగ్ని గుండం ఏర్పాటు చేసి బుధవారం వేకువజామున మండల కేంద్రంలోని బుక్కరాయసముద్రంలో అగ్నిగుండంలోకి పీర్లను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్లి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం సాయంత్రం పీర్లను జలధికి తరలించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ వెంకటేశ్వుర్లు బందోబస్తు పర్యవేక్షించారు.

రాప్తాడు: మండలంలోని గొందిరెడ్డిపల్లి, గంగలకుంట గ్రామాల్లో బుధవారం మొహరం వేడుకలు వైభవంగా నిర్వహించారు. పీర్లను పూలు, వెండి ఆభరణాలతో అలంకరించి పూజించారు. భక్తులు పీర్లను ఎత్తుకుని అగ్ని గుండంలో నడిచారు. పీర్లను గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.


గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల, డ్యాం, కోటంక, బూదేడు, కొత్తపల్లి తదితర గ్రామాల్లో మొహరం వేడుకలు ముగిశాయి. వివిధ గ్రా మాల్లో వారం రోజుల నుంచి భక్తి శ్రద్ధలతో పీర్లస్వాములను మకానంలో ఉంచి పూజలు చేశారు. బుధవారం జలధి కార్యక్రమం సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పీర్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. అనంతరం పీర్లు జలధికి తరలించారు.

ధర్మవరంరూరల్‌(కనగానపల్లి): కనగానపల్లి మండలంలోని యలకుంట్ల, తదితర గ్రామాల్లో పీర్ల జలధి మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆయా గ్రామాల్లో పీర్లస్వాములు అగ్నిగుండం ప్రవేశం చేసి జలధికి తరలివెళ్లాయి.

Updated Date - Jul 17 , 2024 | 11:57 PM