LITERATURE: సీమ సాహిత్యం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:31 AM
రాయలసీమ నుంచి గొప్ప ఆధునిక సాహిత్యం వస్తోందని, ఇక్కడి సాహిత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి పేర్కొన్నారు.
అనంతపురం కల్చరల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ నుంచి గొప్ప ఆధునిక సాహిత్యం వస్తోందని, ఇక్కడి సాహిత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి పేర్కొన్నారు. విమలాశాంతి సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో మంచిర్యాల జిల్లాకు చెందిన లేదాళ్ల రాజేశ్వరరావుకు విమలాశాంతి కవితా పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య స్వరూపరాణి మాట్లాడుతూ... కవి లేదాళ్ల రాజేశ్వరరావు ఓవైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే మరోవైపు సాహితీరంగంలో తనదైన ముద్ర వేసుకోవడం అభినందనీయమన్నారు. విమలాశాంతి సాహిత్య సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతియేటా సాహితీకారులకు ప్రోత్సాహకంగా అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం లేదాళ్ల రాజేశ్వరరావుకు కవితా పురస్కారంతోపాటు రూ.10వేలు నగదు బహుమతి అందజేసి సత్కరించారు. విమలాశాంతి సాహిత్య సేవాసమితి వ్యవస్థాపకుడు శాంతినారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి సంయుక్త అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ అంకె శ్రీనివాస్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, మారుతి, సురేష్, వెంకటేశులు, ఆదినారాయణ, లక్ష్మినారాయణ, షేక్ నబిరసూల్ తదితరులు పాల్గొన్నారు.