Share News

అంగనవాడీల్లో మందుల కొరత

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:28 AM

అంగనవాడీ కేంద్రాల్లో మెడికల్‌ కిట్ల కొరత వేధిస్తోంది. కేంద్రంలో దెబ్బలు తగిలినా, జలుబు, జ్వరం, దగ్గు వంటివి సొకినా చిన్నారులను ఇంటికి పంపుతున్నామని, నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని అంగనవాడీ కార్యకర్తలు వాపోతున్నారు.

అంగనవాడీల్లో మందుల కొరత

ధర్మవరం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ కేంద్రాల్లో మెడికల్‌ కిట్ల కొరత వేధిస్తోంది. కేంద్రంలో దెబ్బలు తగిలినా, జలుబు, జ్వరం, దగ్గు వంటివి సొకినా చిన్నారులను ఇంటికి పంపుతున్నామని, నెలలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని అంగనవాడీ కార్యకర్తలు వాపోతున్నారు. సత్యసాయి జిల్లాలో 12 ప్రాజెక్టుల కింద 2,824 అంగనవాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి కింద 2801 మంది కార్యకర్తలు, 2,196 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాల్లో 10,931 మంది గర్భిణీలు, 9,394 మంది బాలింతలు, ఆరు సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 1.10 లక్షల మంది ఉన్నారు. వీరికి పోషణతోపాటు, బలవర్థక ఆహారం, ఆలనా, వారి సంక్షేమం విషయంలో అంగనవాడీ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంగనవాడీ కేంద్రాల్లో చిన్నారులకు స్వల్ప అనారోగ్యం, చిన్నచిన్న గాయాలకు వెంటనే వైద్యసేవలు అందించాలని ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కిట్‌లో పలు రకాల ఔషధాలు, కొన్ని సిర్‌పలు ఉండేవి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం తక్కువ మోతాదులో మెడికల్‌ కిట్లు అందించింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏ ఒక్క అంగనవాడీ కేంద్రంలో మెడికల్‌ కిట్లు కనిపించలేదు. అరకొరగా ఉన్నచోట ముఖ్యమైన మందులు అయిపోయాయి. నెలలు గడుస్తున్నా సరఫరా చేయలేదు. చిన్నారుల తల్లులు అడుగుతున్నా కిట్లు, మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇది అంగనవాడీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.

ఇండెంట్‌ పెట్టాం : వెంకటలక్ష్మి, ఇనచార్జ్‌ పీడీ, ఐసీడీఎస్‌, సత్యసాయి జిల్లా

జిల్లా వ్యాప్తంగా అంగనవాడీ కేంద్రాల్లో మందుల కొరత ఉన్నది వాస్తవమే. మందుల కొరతపై ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టాం. ప్రస్తుతం ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్త ద్వారా మందులు తీసుకుని చిన్నారులకు అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి మెడికల్‌ కిట్లు రాగానే కేంద్రాలకు పంపిణీ చేస్తాం.

Updated Date - Dec 01 , 2024 | 12:28 AM