RAINS : నైరుతి.. శుభారంభం
ABN , Publish Date - Jun 04 , 2024 | 12:24 AM
నైరుతి రుతుపవనాలు ఆరంభంలోనే మేఘాల నిండా నీటిని మోసుకొచ్చాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాప్తాడు సమీపంలోని పండమేర వంక పొంగిపొర్లింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో వేదవతి హగరి నదికి భారీగా నీరు చేరింది. ఉద్దేహాల్ వద్ద వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బళ్లారి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కణేకల్లు మండలంలోనూ భారీ వర్షానికి వేదవతి హగరి నది పొంగిపొర్లింది. ...
జిల్లాలో విస్తారంగా వర్షాలు
వాగులు, వంకలకు జలకళ
నీట మునిగిన ఉద్యాన పంటలు
అనంతపురం అర్బన, జూన 3: నైరుతి రుతుపవనాలు ఆరంభంలోనే మేఘాల నిండా నీటిని మోసుకొచ్చాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాప్తాడు సమీపంలోని పండమేర వంక పొంగిపొర్లింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొమ్మనహాల్ మండలంలో వేదవతి హగరి నదికి భారీగా నీరు చేరింది. ఉద్దేహాల్ వద్ద వంతెనపై వరదనీరు పొంగిపొర్లడంతో బళ్లారి, కళ్యాణదుర్గం ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కణేకల్లు మండలంలోనూ భారీ వర్షానికి వేదవతి హగరి నది పొంగిపొర్లింది.
బొమ్మనహాళ్‌లో అత్యధికం..
బొమ్మనహాళ్ మండలంలో ఆదివారం రాత్రి అత్యధికంగా 91.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 84.2, కణేకల్లు 80, గుత్తి 62.6, పెద్దవడుగూరు 56.2, ఆత్మకూరు 50.4, డి. హీరేహాళ్ 50, కూడేరు 46.2, రాయదుర్గం 43.2, నార్పల 42.4, రాప్తాడు 40.4, గార్లదిన్నె 37.8, పామిడి 35.4, వజ్రకరూరు 35.2, యాడికి 32.0, శింగనమల 30.8, కళ్యాణదుర్గం 23.4, అనంతపురం నగరం 20.2, ఉరవకొండ 17.4, కంబదూరు 16.4, విడపనకల్లు 15.8, బ్రహ్మసముద్రం 12.2, గుంతకల్లులో 11.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 9.4 మి.మీ. వరకూ వర్షపాతం నమోదైంది.
భారీగా పంటనష్టం
భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 17.90 హెక్టార్లల్లో రూ.34.72 లక్షల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, మామిడి, బొప్పాయి, టమోటా పంటలు ధ్వంసమయ్యాయి. బొమ్మనహాళ్ మండలంలో 200 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. రూ.60 లక్షలకుపైగా పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కనగానపల్లి మండలంలో కనగానపల్లి, ముత్తవకుంట్ల, తల్లిమడుగులు, యలకుంట్ల, తగరకుంట, బద్దలాపురం తదితర గ్రామాల్లో వంకలు, వాగులు, చెక్‌డ్యాంలు పొంగిపోర్లాయి. కనగానపల్లిలో రైతు బట్టా నాగభూషణం 12 ఎకరాల్లో సాగుచేసిన అరటి మొక్కలు నీటమునిగాయి. రూ.10 లక్షల దాకా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....