Share News

ZP STANDING COMITTEE: అన్నదాతలను ఆదుకోవాలి

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:23 AM

అడవి జంతువుల దాడితో పంటలు నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జడ్పీలోని సమావేశ మందిరంలో చైర్‌పర్సన గిరిజ అధ్యక్షతన, సీఈఓ ఓబులమ్మ ఆధ్వర్యంలో ఏడు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు.

ZP STANDING COMITTEE: అన్నదాతలను ఆదుకోవాలి
ZP Chairperson Boya Girija speaking

ముగిసిన స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు

అనంతపురం విద్య, సెప్టెంబరు 20: అడవి జంతువుల దాడితో పంటలు నష్టపోతున్న అన్నదాతలను ఆదుకోవాలని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జడ్పీలోని సమావేశ మందిరంలో చైర్‌పర్సన గిరిజ అధ్యక్షతన, సీఈఓ ఓబులమ్మ ఆధ్వర్యంలో ఏడు స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించారు. కొందరు సభ్యులు మాట్లాడుతూ... రొద్దం, లేపాక్షి, తదితర ప్రాంతాల్లో అడవి పందుల దాడి ఎక్కువగా ఉందని, మొక్కజొన్నలు తినేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులకు మేలు చేసేలా ఏమి చర్యలు తీసుకుంటారని చైర్‌పర్సన అధికారులను ప్రశ్నించారు. అటవీ శాఖాధికారులు స్పందిస్తూ.....అడవి జంతువుల వల్ల పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని, దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ విషయం తమకే తెలియదని, ఇక రైతులకేం తెలుస్తుందని పలువురు సభ్యులు పేర్కొన్నారు. జడ్పీ చైర్సన కలుగజేసుకుని ఈ అంశంపై కరపత్రాల ద్వారా విస్తృతమైన ప్రచారం కల్పించాలని, చైతన్యం తేవాలని సూచించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మంజూరైన పనులు కొన్ని తీర్మానాలు లేక ఆగిపోయాయని, మరికొన్ని సగంలో ఉంటే...కొన్ని పూర్తయ్యాయన్నారు. బిల్లులు వస్తాయా..రావా అనే సందేహం చాలా మందిలో ఉండిపోయిందన్నారు. దీనికి సీఈఓ, ఇంజనీర్లు మాట్లాడుతూ.. పనులు పూర్తయితే...తప్పకుండా చెల్లిస్తారంటూ హామీ ఇచ్చారు. ఉరవకొండ, బుక్కరాయసముద్రం ప్రాంతాల్లో ఇంకుడు గుంతల పనులకు బిల్లులు చెల్లించాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సభ్యులు కోరారు. తర్వాత అంగనవాడీల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:23 AM