AP ELECTONS : ఫ్యానకు చెమటలు
ABN , Publish Date - May 10 , 2024 | 12:41 AM
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో భారీ స్థాయిలో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 26,150 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటి వరకూ 21,583 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతపురం అర్బనలో అత్యధికంగా 5,478 మంది ఓటు వేశారు. రాప్తాడులో 3,043 మంది ఓటు హక్కు వినియోగించుకుని రెండో స్థానంలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అంతర్ జిల్లావారు 2,231 మంది ఉండగా, 1,478 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ 82.53 శాతం పోలింగ్ నమోదైంది. అత్యవసర సేవలు అందించే మరో 33 శాఖల ఉద్యోగులకు ...
భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
మొత్తం.. 26,150.. పోలైనవి 21,583..
ఇప్పటివరకూ 82.53 శాతం నమోదు
గతంలో 50 శాతానికి మించని వైనం
ప్రభుత్వ వ్యతిరేకతతో పెరిగిన పోలింగ్
అనంతపురం టౌన, మే 9: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో భారీ స్థాయిలో పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 26,150 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేశారు. వీరిలో ఇప్పటి వరకూ 21,583 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతపురం అర్బనలో అత్యధికంగా 5,478 మంది ఓటు వేశారు. రాప్తాడులో 3,043 మంది ఓటు హక్కు వినియోగించుకుని రెండో స్థానంలో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లలో అంతర్ జిల్లావారు 2,231 మంది ఉండగా, 1,478 మంది ఓటు వేశారు. ఇప్పటి వరకూ 82.53 శాతం పోలింగ్ నమోదైంది. అత్యవసర సేవలు అందించే మరో 33 శాఖల ఉద్యోగులకు శుక్రవారం వరకూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ నెల 3 నుంచి జిల్లాలో
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. విపరీతమైన ఎండలు, ఉక్కపోత అల్లాడిస్తున్నా వేతన జీవులు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గంటల కొద్దీ వేచిచూసి మరీ తమ హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు చుట్టూ తొలి రోజు నుంచి వివాదాలు అలుముకున్నాయి. తక్కువ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఫారం-12 సమర్పించినా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో పోలింగ్ గడువును ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ పొడిగించారు. అప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోలేనివారికి గురువారం 9వ తేదీ కూడా అవకాశం ఇచ్చారు.
ఎన్నడూలేనంతగా..
జగన విపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు సీపీఎస్ సహా అనేక హామీలు ఇచ్చారు. జగన మాటలను నమ్మి.. ఆ వర్గాలు గంపగుత్తగా వైసీపీకి ఓట్లు వేశాయి. అధికారంలోకి వచ్చాక జగన హామీలను విస్మరించారు. పీఆర్సీ, హెచఆర్‌ఏ, సీపీఎస్ అంశాలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తే.. కట్టడి చేశారు. ఆందోళనలకు దిగితే అణచివేశారు. మానసికంగా వేధించారు. ఈ నేపథ్యంలో అవకాశం కోసం ఇన్నాళ్లూ వేచిచూసిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ‘ఓటెత్తినట్లు’ స్పష్టంగా
కనిపిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు పోస్టల్ బ్యాలెట్ ఓటు శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాయి. మరోవైపు ఓటుకు నోటు ఇవ్వాలని చూశారు. ఫెసిలిటేషన కేంద్రాల వద్ద తిష్టవేసి పలురకాలుగా ప్రలోభాలకు గురిచేశారు. అయినా ఎవరూ బెదరకుండా తమ హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ 50 శాతానికి మించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగేది కాదని, ఇప్పుడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఏకంగా 82.53 శాతం ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 80 శాతానికి పైగా ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు టీడీపీ కూటమికి అనుకూలంగా ఓటు వేసినట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
ఈ మాత్రం చాలు..
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూశాక ఫ్యాన పార్టీకి చెమటలు పడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అత్యధికంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని వైసీపీ అనుకూల సంఘాల నాయకులే చెబుతున్నాయి. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో కూడా వారి కుటుంబాలు ఇదే స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కో ఉద్యోగి కుటుంబం నుంచి సగటున నాలుగు ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయని, అధికార పార్టీ అభ్యర్థుల ఓటమికి ఈమాత్రం చాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..