Crime : ఘోరం
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:49 PM
మండలంలోని హావళిగి గ్రామంలో పాత మట్టి మిద్దె కూలి ఆదివారం తెల్లవారుజామున దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన కోనప్ప గారి మారెప్ప(48), అతడి భార్య లక్ష్మిదేవి(44) కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి పైకప్పునకు శనివారం రాత్రి 8 గంటల వరకూ ఆర్‌సీసీ వేశారు. వారి ఆచారం ప్రకారం ఆర్‌సీసీ వేసిన కొత్త ఇంటిలో నిద్రించకూడదని, ఆదివారం ఉదయం కొత్త ఇంటిలో చేరుదామని, పక్కనే ఉన్న తమ పాత ఇంటిలో నిద్రించారు. మారెప్ప, అతడి భార్య లక్ష్మిదేవి ఇంటికి ...
మట్టి మిద్దె కూలి దంపతుల దుర్మరణం
విడపనకల్లు, జూలై 14: మండలంలోని హావళిగి గ్రామంలో పాత మట్టి మిద్దె కూలి ఆదివారం తెల్లవారుజామున దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన కోనప్ప గారి మారెప్ప(48), అతడి భార్య లక్ష్మిదేవి(44) కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి పైకప్పునకు శనివారం రాత్రి 8 గంటల వరకూ ఆర్‌సీసీ వేశారు. వారి ఆచారం ప్రకారం ఆర్‌సీసీ వేసిన కొత్త ఇంటిలో నిద్రించకూడదని, ఆదివారం ఉదయం కొత్త ఇంటిలో చేరుదామని, పక్కనే ఉన్న తమ పాత ఇంటిలో నిద్రించారు. మారెప్ప, అతడి భార్య లక్ష్మిదేవి ఇంటికి మధ్యలో నిద్రించారు. మృతురాలి తమ్ముడు రాము, కూతురు మానస కొంచెం ముందు భాగంలో నిద్రించారు. ఇద్దరు కొడుకులు అంజి, హనుమంతు ఇంటి ఎదుట వరండాలో నిద్రించారు. అయితే శనివారం సాయంత్రం గాలితో కూడిన చిన్నపాటి వర్షం కురిసిన నేపథ్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల
సమయంలో మట్టిమిద్దె పైకప్పు కూలింది. దీంతో ఇంటికి మధ్యలో నిద్రిస్తున్న మారెప్ప, లక్ష్మిదేవి మట్టిలో కూరుకుపోయి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. చివరలో ఇరుక్కున్న మృతురాలి కూతురు మానస, మృతురాలి తమ్ముడు రాములను గ్రామస్థులు కాపాడి 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ వన్నప్ప, వీఆర్వో రవికుమార్, పాల్తూరు ఇనచార్జి ఎస్‌ఐ ఖాసీంసాబ్, సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉరవకొండలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కలిసే కాటికి పోతున్నారా!
దంపతులు మారెప్ప, లక్ష్మిదేవి ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇన్నాళ్లు కలిసి బతికిన మీరు కలిసే కాటికి పోతున్నారా అంటూ రోదించారు. దంపతులిద్దరూ మట్టిలో కూరుకుపోయి మృతి చెందటంతో వీరిని చూడటానికి గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
అనాఽథలుగా మారిన ముగ్గురు పిల్లలు
మృతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె మానస (దివ్యాంగురాలు) ఉన్నారు. కొడుకులు ఏదోలా బతకగలరు. కానీ కూతురు పరిస్థితి ఏమిటని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టుకతోనే మాటలు రాని మానస ఆలనా పాలన ఎవరు చూసుకుంటారు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. మృతురాలికి తల్లీదండ్రి కూడా లేరని ఉన్న ఒక సోదరుడు కూడా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, వీరికి దిక్కెవరు అంటూ అక్కడికి వచ్చిన వారు కంటతడి పెట్టుకున్నారు.
అప్పులు చేసి కొత్త ఇంటి నిర్మాణం
కోనప్ప గారి మారెప్ప వైసీపీ కార్యకర్త అయినా వైసీపీ పాలనలో ఇల్లు మంజూరు కాలేదు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో ఇతడి పేరున ఇంటి బిల్లును అప్పటి కాంగ్రెస్ నాయకులు కాజేయడమే కారణం. దీంతో తమకు ప్రభుత్వం నుంచి ఇల్లు రాదని భావించిన కూలిపనులు చేసుకునే ఆ దంపతులు అప్పులు చేసి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. శనివారం సాయంత్రం తమ కొత్త ఇంటికి పైకప్పు వేశారు. ఆదివారం ఉదయం కొత్త ఇంటిలోకి చేరాలని, పక్కనే ఉన్న తమ పాత మిద్దెలో నిద్రించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తెల్లారి ఉంటే కొత్త ఇంటిలోకి చేరేవారని దేవుడు ఎంత పని చేశాడని గ్రామస్థులు ఆవేదన చెందారు.
మంత్రి కేవవ్ దిగ్ర్భాంతి
హావళిగి గ్రామానికి చెందిన మారెప్ప, లక్ష్మిదేవి మిద్దె కూలి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఫోన ద్వారా చర్చించారు. మృతుల కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వాలని విడపనకల్లు తహసీల్దార్‌ను ఆదేశించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....