Share News

COLLECTOR: మార్కెట్‌ యార్డు మరింత మెరుగుపడాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:59 PM

అనంత వ్యవసాయ మార్కెట్‌ యార్డు మరింత మెరుగుపడేలా పనిచేయాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డును సంబంధిత అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.

COLLECTOR: మార్కెట్‌ యార్డు మరింత మెరుగుపడాలి
Collector Vinod Kumar talking to Chinese traders and farmers

అనంతపురంరూరల్‌, జూలై 31: అనంత వ్యవసాయ మార్కెట్‌ యార్డు మరింత మెరుగుపడేలా పనిచేయాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డును సంబంధిత అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. యార్డులోని చీనీ మార్కెట్‌ను సందర్శించారు. చీనీ వేలం గురించి రైతులను, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఈనామ్‌ వేలం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం ఎస్‌ఎ్‌సఎఫ్‌ ఫ్రూట్స్‌ మండి వారు రైతుల నుంచి కొన్న చీనీ కాయలు, డ్రాగన ఫ్రూట్స్‌ ఇతర పండ్లను గ్రేడింగ్‌ చేసి ఢిల్లీ, ముంబై లాంటి ప్రదేశాలకు రవాణా చేస్తున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మార్కెటింగ్‌ శాఖ ఏడీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైయ్యారు. గతేడాది కంటే ఈ ఏడాది మార్కెట్‌ ఫీజు వసూళ్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. నిరుపయోగంగా ఉన్న గోదాములను గుర్తించి వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న గోదాములను బాడుగకు ఇచ్చే విధంగా అవసరమున్న ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్‌ సంస్థలకు పబ్లిసిటీ ద్వారా తెలియజేసి వాటిని ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. ఏడీ సత్యనారాయణ చౌదరి, అనంత యార్డు కార్యదర్శి జయలక్ష్మి, డీఈ రఘునాథ్‌ పాల్గొన్నారు.


సర్వజన ఆస్పత్రి పరిశీలన: జిల్లా సర్వజన ఆస్పత్రిని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ బుధవారం పరిశీలించారు. గంటపాటు ఆస్పత్రిలోనే ఉంటూ పలు విభాగాలను స్వయంగా వెళ్లి పరిశీలించారు. గైనిక్‌, బాలింతల వార్డులతో పాటు, క్షయ, డయాలసిస్‌, ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డులను పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులతో ఆస్పత్రి మ్యాప్‌ చూపించుకుంటూ ఎక్కడ ఏఏ విభాగం ఉందో తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఆగిపోయిన నిర్మాణ పనులను అధికారులతో మాట్లాడుతూ అక్కడ ఏమి నిర్మిస్తున్నారని, ఏనిధులతో కట్టిస్తున్నారు, ఎవరుకాంట్రాక్టరు, ఎందుకు పనులు ఆగాయి అని ప్రశ్నించారు. కొంతమంది గైనిక్‌ డాక్టర్లుతో ఆ విభాగంలో నెలకొన్న సమస్యలు, డాక్టర్లు పడుతున్న ఇబ్బందులు గురించి కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శివకుమార్‌, ఇంజనీరింగ్‌ అధికారులు చంద్రశేఖరరెడ్డి, నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:59 PM