ASHA WORKERS: ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:45 PM
ప్రజారోగ్యం కోసం నిరంతరం కేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టరు గేయానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతపురంటౌన, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యం కోసం నిరంతరం కేత్రస్థాయిలో శ్రమిస్తున్న ఆశాకార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టరు గేయానంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగభద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవుల జీఓలు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ వయసు 62ఏళ్లకు పెంచాలని, రాజకీయనేతలు, అధికారుల వేధింపులు ఆపాలని, ఖాళీగా ఉన్న ఆశాపోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆశాల ఆందోళనకు గేయానంద్, సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్ మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యపరిరక్షణకు ఆశాలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అయినా కనీసవేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి ఆశాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రీవెన్సలో జేసీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోపాల్, రామాంజనేయులు, బాలరంగయ్య, ఆశాలు మాలతి, నాగమణి, అక్కమ్మ, భాగ్యమ్మ, హుస్సేన, అంబికా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.