Share News

HOSPITAL దాతల సేవలు వృథా

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:45 PM

ప్రజల సౌకర్యార్థం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దాతలు ఏర్పాటు చేసిన పలు ఉపకరణాలు నిరుపయోగంగా మారాయి. ఆసుపత్రిలో రోగులకు తాగునీరు అందడం లేదని తెలుసుకొని కొంత మంది దాతలు స్పందించి మాతా శిశు కేంద్రం వద్ద తాగునీరు అందించే వాటర్‌ ఫిల్టర్లను అందించారు.

HOSPITAL దాతల సేవలు వృథా
మాతాశిశు ఆసుపత్రిలో మెట్ల కింద పడేసిన వాటర్‌ ఫిల్టర్‌

మూలనపడిన ఉపకరణాలు

రోగులకు తప్పని తిప్పలు

హిందూపురం అర్బన, జూన 8: ప్రజల సౌకర్యార్థం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దాతలు ఏర్పాటు చేసిన పలు ఉపకరణాలు నిరుపయోగంగా మారాయి. ఆసుపత్రిలో రోగులకు తాగునీరు అందడం లేదని తెలుసుకొని కొంత మంది దాతలు స్పందించి మాతా శిశు కేంద్రం వద్ద తాగునీరు అందించే వాటర్‌ ఫిల్టర్లను అందించారు. దీంతో ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీరింది. అయితే వాటర్‌ ఫిల్టర్లు ఏమయ్యాయో తెలియదు కాని రోగులకు తాగునీరు అందడం లేదు. దీంతో రోగులు బయట నుంచి నీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా సమయంలో ప్రస్తుత అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పందించి గర్భిణులకు వేడినీటిని అందించే గీజర్‌లు ఏర్పాటు చేయించారు.


అయితే అవి కూడా పనిచేయలేదని తెలిసింది. దీంతో గర్భిణులు వేడి నీటిని బయటి నుంచి కొని తెచ్చుకుంటున్నారు. దీంతో దాతల సహకారం వృథాగా మారింది. దాతలు అందించిన ఉపకరాణాలు వృథాగా పడేసినా పట్టించుకునే నాథుడు లేడు. బాధ్యతగా ఉండాల్సిన సూపరింటెండెంట్‌లు వాటినిపై శ్రద్ధ చూపడం లేదు. కరోసా సమయం నుంచి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మంది సూపరింటెండెంట్‌లు మారారు. దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి ఏ ఏ ఉపకరణాలు అందించారో వారికి అవగాహన లేకపోయి ఉండవచ్చు. రోగులకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. సమస్యపై సూపరింటెండెంట్‌ను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jun 08 , 2024 | 11:46 PM