Health : వస్తారు.. మాయమౌతారు..!
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:27 AM
పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని(సీహెచసీ)కి వైద్యులు రాం.. రాం.. అంటున్నారు. వచ్చి విధుల్లో చేరిన రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతారు. సెలవు పెట్టరు.. రాజీనామా చేయరు. మొత్తం 8 మంది వైద్యులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీహెచసీలో వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. చేసేదిలేక జబ్బుల బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణాలకు వెళ్తున్నారు. వెరసి ప్రయాణ, వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సీహెచసీ 24 గంటలు ...
గోరంట్ల సీహెచసీకి వైద్యులు రాం.. రాం..
అలా చేరి.. ఇలా గైర్హాజరవుతున్న డాక్టర్లు
నెలలుగా హాజరుకాని వైనం
ఆస్పత్రిలో అందని వైద్యసేవలు
రోగులకు తప్పని తిప్పలు
గోరంట్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాని(సీహెచసీ)కి వైద్యులు రాం.. రాం.. అంటున్నారు. వచ్చి విధుల్లో చేరిన రోజుల వ్యవధిలోనే కనిపించకుండా పోతారు. సెలవు పెట్టరు.. రాజీనామా చేయరు. మొత్తం 8 మంది వైద్యులకుగాను ముగ్గురే పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీహెచసీలో వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి. చేసేదిలేక జబ్బుల బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణాలకు వెళ్తున్నారు. వెరసి ప్రయాణ, వైద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సీహెచసీ 24 గంటలు పనిచేయాల్సి ఉంది. రోజూ అవుట్ పేషెంట్లు 300 నుంచి 450 మంది వరకు
వస్తుంటారు. మొత్తం 8 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఒక దంతవైద్యుడు, ఇద్దరు ఫిజీషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు లేరు. వైద్యుల కొరతతో అత్యవసర కేసులకు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలిస్తున్నారు.
కనిపించకుండాపోతున్న డాక్టర్లు
సీహెచసీ వైద్యాధికారిగా పనిచేస్తున్న చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ శివకుమార్ ఉద్యోగోన్నతిపై హిందూపురానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హిందూపురం ఆసుపత్రి ఎస్‌ఎనసీలో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ కీర్తిని గోరంట్ల సీహెచసీ రెగ్యులర్ వైద్యురాలిగా నియమించారు. ఈ ఏడాది మార్చి 15న ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండురోజులు గడిచాయో లేదో.. ఆమె కనిపించకుండా పోయారు. దీంతో డ్రాయింగ్ అఽథారిటీ ఎవరు స్వీకరించాలన్న దానిపై వైద్యులు తర్జనభర్జన పడ్డారు. చివరికి అయిష్టంగానే గైనకాలజీ వైద్యురాలు పావని బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆమె కూడా ఆ బాధ్యతలు నిర్వహించలేక సెలవు పేరుతో ఈ ఏడాది జూలై 26 నుంచి కనిపించకుండా పోయారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న జనరల్ మెడిసిన డాక్టర్ హరీష్ సైతం ఈ ఏడాది మే 1 నుంచి విధులకు హాజరుకాలేదు. అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న అనస్థీషియా వైద్యుడు దానేష్ ఈ ఏడాది ఏప్రిల్ 4న విధుల్లో చేరారు. రెండ్రోజులు తిరక్కుండానే 6వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు. జనరల్ సర్జన లేకపోవడంతో ఫిజీషియన వినోద్‌కుమార్ వైద్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ ఉష, దంత వైద్యుడు వేణుగోపాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.
రెండుచోట్లా ఎలా?
డాక్టర్ కీర్తి గోరంట్ల సీహెచసీలో రెగ్యులర్ వైద్యురాలిగా బాధ్యతలు తీసుకోకపోయి ఉండుంటే మరో డాక్టర్‌ను నియమించి ఉండేవారు. ఆమె అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. ఆమె ఇక్కడే గతనెల వరకు పనిచేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆమె హిందూపురంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. ఒకే వ్యక్తి రెండు ఉద్యోగాల్లో కొనసాగడానికి వీలులేదు. అయినా ఈవిషయాన్ని చాలాకాలం గుర్తించలేదు. చివరికి విషయం బయటకు పొక్కడంతో రహస్యంగా గోరంట్ల ఆసుపత్రినుంచి బయోమెట్రిక్ అటెండెన్సను హిందూపురానికి బదిలీ చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆక్టోబరు 21న రాజీనామా సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో సొంత క్లీనిక్‌లు ఏర్పాటు చేసుకున్న పలువురు వైద్యులు మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడం ఇష్టం లేక గైర్హాజరవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
గోరంట్ల సీహెచసీలో ఐదు స్పెషలిస్టు వైద్య పోస్టులు, హెడ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఓపీ అధికంగా ఉండడంతో పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించలేకపోతున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం హిందూపురం నుంచి ఇద్దరు చిన్నపిల్లల వైద్యులు, కదిరి నుంచి గైనకాలజీ డాక్టర్ వారంలో మూడురోజులపాటు గోరంట్లలో విధులు నిర్వహిస్తున్నారు.
- వినోద్‌కుమార్, గోరంట్ల సీహెచసీ వైద్యాధికారి
నోటీసులు జారీ చేశాం
చిన్నపిల్లల వైద్యురాలు కీర్తి రెండుచోట్లా పనిచేయడం పట్ల నోటీసులు జారీ చేశాం. ఆమె రాజీనామా చేశారు. మరో వైద్యురాలు పావనికి కూడా నోటీసులిచ్చాం. గోరంట్ల సీహెచసీలో వైద్యుల కొరత ఉన్న విషయం వాస్తవమే. ఇతర ఆస్పత్రుల నుంచి వైద్యులను పంపుతున్నాం.
- తిప్పేంద్రనాయక్, డీసీహెచఎ్‌స
మరిన్ని అనంతపురం వార్తల కోసం..