Share News

WHIP KALAVA: ట్రూ అప్‌ పాపం జగనదే

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:04 AM

ట్రూ అప్‌ చార్జీల భారం మాజీ సీఎం జగనరెడ్డిదేనని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు.

WHIP KALAVA: ట్రూ అప్‌ పాపం జగనదే
Kalava Srinivasulu talking to the media

అనంతపురం డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ట్రూ అప్‌ చార్జీల భారం మాజీ సీఎం జగనరెడ్డిదేనని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారని ఆరోపించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరితో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు నెలలుగా ప్రజా రంజక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైసీపీ రాజకీయ కుట్రలకు తెరతీస్తోందని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులను విస్మరించారని, వారిపై కపట ప్రేమను చూపుతూ ఇటీవల ధర్నా చేశారని అన్నారు. తాజాగా కరెంటు చార్జీల పెంపు పేరుతో నిరసన చేపట్టడం ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమేనని అన్నారు. విద్యుత చార్జీల పెంపెతో సీఎం చందబ్రాబు పరిపాలనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ పాలకులు చేసిన పాపాలే దీనికి కారణమని అన్నారు. అవసరం లేకపోయినా, అధిక ధరలకు విద్యుతను కొనుగోలు చే శారని అన్నారు. చౌకగా వస్తున్న విద్యుతను కాదని, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కరెంటు కొనుగోలు చేసినందుకే విద్యుత రంగం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తప్పుడు వివరాలతో ప్రజలను మోసం చేసేందుకుౖ ధర్నాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతకు ముందు మాజీ ప్రధాని మన్మోహనసింగ్‌ మృతికి మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రచార కార్యదర్శి కూచి హరి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గంజే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 12:04 AM