Share News

sand ఉచితం.. దోపిడీ మార్గం..!

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:19 PM

గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇసుక కష్టాల నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కూటమి సర్కారు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఇసుక ఉచితంగా తోలుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఎంతో భారం తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

sand ఉచితం.. దోపిడీ మార్గం..!
ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి వద్ద రీచలో ఇసుకను తోడుతున్న దృశ్యం

జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపు

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన

చోద్యంచూస్తున్న అధికారులు

ముదిగుబ్బ డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇసుక కష్టాల నుంచి ప్రజలకు పూర్తి ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో కూటమి సర్కారు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఇసుక ఉచితంగా తోలుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఎంతో భారం తప్పిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా తోలుకునే వీలు కల్పించడంతో ఆర్థిక భారం తగ్గుతోంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇసుక తెచ్చుకోవచ్చు. దీంతో ఉచిత ఇసుక విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో కూడా ఇసుక మాఫియా అక్రమ మార్గాలు వెతుకుతోంది. ఉచిత ఇసుక విధానం మాటున దోపిడీ సాగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు చేపట్టి, టిప్పర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు.. టిప్పర్లతో రవాణా..

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నది పరీవాహక ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రకటించింది. ఇదే అదునుగా భావించిన కొందరు నాయకులు రాత్రింబవళ్లు ఇసుకను తవ్వుకుని దర్జాగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిందిస్థాయి అధికారులను భయపెడుతూ రవాణా సాగిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌, ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చిత్రావతి నదికిరువైపులా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలున్నాయి. నిబంధనల ప్రకారం చుట్టుపక్కల గ్రామాల వారికి మాత్రమే ఇసుక ఉచితం. అన్నిపార్టీల నాయకులు సిండికేట్‌ అయి సొంత మనుషులను ఏర్పాటుచేసుకుని, ఇసుకను లోడింగ్‌ చేస్తూ రవాణాతో సొమ్ము చేసుకుంటున్నారు. దూరాన్ని బట్టి ఎక్కువ ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌లో ఇసుకను నింపేందుకు రూ.1000, అక్కడి నుంచి తరలించేందుకు దూరాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. ముదిగుబ్బ మండలంలోని పీసీరేవు ఇసుక రీచ నుంచి బత్తలపల్లికి ట్రాక్టర్‌ ఇసుక రూ.3వేలు, ధర్మవరానికి రూ.5వేలు చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇలాగే బ్రహ్మదేవరమర్రికొట్టాల నుంచి మద్దిలేరు వాగులో ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. బత్తలపల్లి మండలంలోని గరిశనపల్లి సమీపాన కొందరు ఏకంగా టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ట్రాక్టర్లకు తరలించేందుకు మాత్రమే ఇసుక ఉచితమని ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసుకుని, టిప్పర్లతో రాత్రింబవళ్లు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

తనిఖీలు మరచిన అధికారులు

కొందరు స్వార్థపరులు, నాయకులు ఉచిత ఇసుక విధానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిమాటున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇదంతా తెలిసిన సంబంధిత అధికారులు మాత్రం వీటిపై దృష్టి సారించట్లేదన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తనిఖీలు చేసిన పాపాన పోలేదు. గత వైసీపీ పాలనలో ఇసుక రీచలలో ఆధిపత్యం కోసం ఆ పార్టీలోని రెండు గ్రూపులు బహిరంగంగానే దాడులు చేసుకుని, ఇన్నోవా వాహనాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా అవే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ వద్ద కూడా ఆధిపత్య, అజమాయిషీ కోసం కొందరు కూటమి నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు:

శ్రీనివాసులు, డీఎస్పీ, ధర్మవరం

ధర్మవరం రెవెన్యూ సబ్‌ డివిజనలో ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేస్తున్నాం.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం:

రామ్మోహన, ఏడీ, మైనింగ్‌ శాఖ

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేసి, జరిమానాలు విధిస్తాం. పేదల గృహనిర్మాణాలు ఇతర అభివృద్ధి పనులకు ఇసుక ఉచితం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవ్‌.

Updated Date - Dec 02 , 2024 | 11:19 PM