Share News

MP AMBIKA: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:19 AM

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అన్నదాతలే ఆ గ్రామాలకు ఊపిరి అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌, రైతుసంఘాలు, సహాయ రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ఓ ప్రైవేట్‌హాల్‌లో జాతీయ రైతు దినోత్సవ సదస్సు నిర్వహించారు.

MP AMBIKA: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు
MP Ambika Lakshminarayana honoring the farmer

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అన్నదాతలే ఆ గ్రామాలకు ఊపిరి అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌, రైతుసంఘాలు, సహాయ రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ఓ ప్రైవేట్‌హాల్‌లో జాతీయ రైతు దినోత్సవ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ సృష్టిలో భూమిపై సమస్త జీవరాశులు ఆరోగ్యంగా జీవించడానికి అన్నదాతల శ్రమే ప్రధాన కారణమన్నారు. అలాంటి రైతులు బాగుంటేనే గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. కిసాన రైలు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇటీవల తాడిపత్రి నుంచి అరటి పంటను రైలు ద్వారా విదేశాలకు తరలించామన్నారు. ఇదంతా అధికారులు, నాయకుల సహకారంతో సాధ్యమైందని తెలిపారు. ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సమయంలోనూ రైతులు మాత్రమే వ్యవసాయం చేసి ప్రజలకు ఆహారాన్ని అందించారని గుర్తుచేశారు. రైతుసంఘం నాయకులు నరేంద్రస్వరూప్‌ మాట్లాడుతూ రైతు సహకార వేదిక రైతులకు ఎంత గానో ఉపయోగపడుతోందని తెలిపారు. విద్యుత్తు ప్రమాదంలో మరణించిన రైతుకుటుంబాల సహాయ నిధికి హార్టికల్చర్‌ రైతుసంఘం నాయకులు భాస్కర్‌ రూ.25వేలు అందజేశారు. అనంతరం ఆదర్శరైతులు 60మందిని రైతురత్న బిరుదుతో సన్మానించారు. అక్కడే రైతు ఉత్పత్తుల స్టాల్స్‌ను ఎంపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెడ్స్‌ సంస్థ వ్యవస్థాపకురాలు భానుజా, రైతు సంఘాల నాయకులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, యువరైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 12:19 AM