Share News

ROAD VIDENING: సర్వం కోల్పోతాం..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 11:37 PM

అక్కడున్న వారిలో చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. దశాబ్దాల కాలంగా చిన్న చిన్న వ్యాపారాలు, కూలీపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ కబురు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తను వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

ROAD VIDENING: సర్వం కోల్పోతాం..!

నాలుగు దశాబ్దాలకుపైగా నివాసం..

ఏనాడూ విస్తరణ ప్రస్తావన లేదంటూ ఆవేదన

ప్రజాప్రతినిధులు తలచుకుంటే సమస్య పరిష్కారం

అనంతపురంరూరల్‌, ఆగస్టు 11: అక్కడున్న వారిలో చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. దశాబ్దాల కాలంగా చిన్న చిన్న వ్యాపారాలు, కూలీపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు విస్తరణ కబురు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్తను వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బళ్లారిరోడ్డు-కళ్యాణదుర్గంరోడ్డు మధ్య ఉన్న పాపంపేట ప్రధాన లింక్‌ రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఆ మేరకు 2022లో రోడ్డు విస్తరణ అనుమతులు కూడా వచ్చినట్లు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల రోడ్డు విస్తరణ అంశాన్ని అహుడా అధికారుల ద్వారా స్థానికులకు తెలిసింది. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా నివాసముంటున్న వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏళ్ల తరబడి స్థానికంగా నివాసముంటున్నాం. ఎన్నడూ రోడ్డు విస్తరణ ప్రస్తావన లేదు. ఇప్పుడు రోడ్డు విస్తరణ మాట వింటున్నాం. ఇదే జరిగితే తాము సర్వం కోల్పోవాల్సిందే. ఇలా జరగకుండా ప్రస్తుత ప్రజా ప్రతినిధులు చొరవ చూపితే మేలు చేసినవారవుతారని స్థానికులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి రోడ్డు విస్తరణ సమస్య..

పాపంపేట రోడ్డు విస్తరణ సమస్యను ఇటీవల టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతమున్న 30 అడుగుల రోడ్డు వలన స్థానికంగా నివాసముంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించారు. రోడ్డు విస్తరణ జరిగితే కలిగే నష్టాన్ని వివరించారు. రెండు రోజుల క్రితం నాయకులతో కలసి అహుడా అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. రోడ్డు విస్తరణ జరిగితే చాలా మంది పేదలు ఇళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అహుడా అధికారులు కనీసం 40 అడుగులైనా రోడ్డు ఉండాలని ప్రతిపాదించగా అన్ని విధాలా మరోసారి పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే చెప్పారు.


బండి జాడ నుంచి.. 30అడుగులకు విస్తరణ

పాపంపేట ప్రాంతం 1978 నుంచి 1980 మధ్య ఏర్పాటైనట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో అడవిలా ఉండేదంటున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి గుడిసెలు వేసుకుని జీవనం సాగించడం మొదలు పెట్టారు. బళ్లారి- కళ్యాణదుర్గం రోడ్డు మధ్య ఉన్న పాపంపేట ప్రధాన లింకురోడ్డుగా చెప్పుకుంటున్న రోడ్డు మొదట్లో బండిజాడగా ఉండేది. కాలక్రమేణా బండి జాడ కాస్త 30 అడుగుల రోడ్డుగా మారింది. దీని వలన ఎవరికీ ఇబ్బంది కూడా లేదు. అయినా ప్రస్తుతం రోడ్డు విస్తరణ చేయాలంటున్నారు. లింకు రోడ్డుకు రెండు వైపులా 70 ఇళ్లకుపైగా ఉంటున్నాయి. ఇందులో ఎక్కువగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఇళ్లే ఉన్నాయి. ఇలాంటి వారికి సంబంధించి 40కిపైగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు విస్తరణ జరిగితే వారంతా చాలా వరకు ఇళ్లను కోల్పోయే అవకాశం ఉంది. రోడ్డు విస్తరణ ప్రస్తావన తెలిసినప్పటి నుంచి ఆయా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇళ్లు కోల్పోతే మా పరిస్థితి కొండగుట్టల పాలు కావాల్సిందేనని వాపోతున్నారు.


ఎవరి కళ్లు మామీదపడ్డాయో?

నలభైఏళ్లుగా స్థానికంగా ఉంటున్నాం. నా భర్త కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. కొడుకు పంచర్‌షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మేము వచ్చినప్పటికీ రాముల విగ్రహాలు రెండు బండల మధ్య ఉండేవి. ఆయన మీదే భారం వేసి నివాసమున్నాం. మాలాంటి వాళ్లపైనా ఎవరి కళ్లు పడ్డాయో ఏమో? ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తారంటున్నారు. ఇదే జరిగితే మా కుటుంబం రోడ్డున పడాల్సిందే.

- పద్మావతి, స్థానికురాలు

ఈ ఇల్లే ఆధారం

మేము ఇక్కడికొచ్చి నలభైఏళ్లు గడిచిపోయింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా ముళ్లకంపలతో అడవిలా ఉండేది. వాటిని తొలగించి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తూ వచ్చాం. ఉన్న స్థలంలోనే కొంత కొడుకులకు ఇచ్చి మిగిలిన దానిలో టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నా. ఈ ఇల్లే ఆధారం. రోడ్డు విస్తరణలో ఉన్న ఇల్లు పోతే చెట్లగుట్టలపాలు కావాల్సిందే.

- ఖాసీం, స్థానికుడు

అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం

కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి ఉంటున్నాం. మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే జీవనం సాగించాం. టైలరింగ్‌ పనిచేస్తూనే చిన్న ఇల్లు కట్టుకుని నివాసముంటూ వచ్చాను. పిల్లలు కొంత ప్రయోజకులు కావడంతో ఈ మధ్యనే బ్యాంకులోన, కొంత అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇంతలోనే రోడ్డు విస్తరణ జరుగుతుందని, ఇల్లు పోతుందంటున్నారు. ఈ ఇల్లు తప్పా..మరో ఆదరువు లేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. - గౌస్‌పీర్‌, స్థానికుడు

Updated Date - Aug 11 , 2024 | 11:37 PM