Handriniva canal హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తాం
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:39 AM
హంద్రీ నీవా ప్రధాన కాలువను వెడల్పు చేస్తామని, అందుకు సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
- ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
- ఎంఎం హళ్లిలో బీటీ రోడ్డు ప్రారంభం
కూడేరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): హంద్రీ నీవా ప్రధాన కాలువను వెడల్పు చేస్తామని, అందుకు సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
మండలంలోని ఎంఎంహళ్లి గ్రామం నుంచి ఆత్మకూరు మండలం సిద్దలాపురం గ్రామం వరకు దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మితమైన బీటీ రోడ్డు ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేశవ్ హాజరయ్యారు. ఎంఎంహళ్లికి మంత్రి రాగానే గ్రామస్థులు, స్థానిక టీడీపీ నాయకులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలుంటే శాశ్వతంగా పరిష్కరిస్తామని, అలాగే ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామాల్లో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాలు కల్పిస్తామన్నారు. ఉరవకొండ నియోజక వర్గ అభివృద్ధికి తాను కూలీగా పని చేస్తానని పేర్కొన్నారు. తర్వాత బీటీ రోడ్డును ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, నాయకులు పూజారి రాజు, దేవేంద్ర, వన్నూరుస్వామి, ఎంపీ అక్కులన్న, టింగ్ అఖిల్, ప్రభాకర్, కొండ, పోతులూరి, ఓబుళపతి, అక్కులన్నతో పాటు తహసీల్దారు మహబూబ్ బాషా, రీ సర్వే డీటీ దబ్బర ప్రసాద్, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, సీఐ రాజు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..