Share News

Survey : సర్వే చేసేదెవరు..?

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:46 PM

అనంతపురం నగరపాలికలో ప్రభుత్వ సర్వేయర్‌ లేకపోవడంతో భూ సమస్యలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా సర్వేయర్‌ పోస్టు ఖాళీగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈక్రమంలో ఇరుగు పొరుగు వారి మధ్య స్థల వివాదాలు గొడవలకు దారి తీస్తున్నాయి. సర్వే చేసి ఎవరి హద్దు ఎక్కడి వరకు ఉందో చెప్పేవారు లేరు. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు నగరంలోని ప్రతి డివిజన్లోనూ ఉండేవే. నగరంలో ఆక్రమించిన భూములు, ...

 Survey : సర్వే చేసేదెవరు..?
The shed was built on the land occupied by former MLA Prakash Reddy in Adarsh ​​Nagar

నగరపాలికలో ఏడాదిగా సర్వేయర్‌ పోస్టు ఖాళీ

వివాదాల్లో అనేక స్థలాలు

ఓపెనసైట్‌లు, పొరంబోకు స్థలాల ఆక్రమణ

ఎమ్మెల్యే ఫిర్యాదుతోనైనా సర్వేయర్‌ వస్తారా..?

చిన్న చిన్న వివాదాలతో నగర ప్రజలు సతమతం

సర్వే శాఖకు విన్నవించుకున్నా నియమించలేని దుస్థితి

అనంతపురం నగరపాలికలో ప్రభుత్వ సర్వేయర్‌ లేకపోవడంతో భూ సమస్యలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా సర్వేయర్‌ పోస్టు ఖాళీగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈక్రమంలో ఇరుగు పొరుగు వారి మధ్య స్థల వివాదాలు గొడవలకు దారి తీస్తున్నాయి. సర్వే చేసి ఎవరి హద్దు ఎక్కడి వరకు ఉందో చెప్పేవారు లేరు. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు నగరంలోని ప్రతి డివిజన్లోనూ ఉండేవే. నగరంలో ఆక్రమించిన భూములు, పొరంబోకు భూముల సంగతి లెక్కే లేదు. వీటిన్నింటిని పరిష్కరించాలంటే ఇద్దరు, ముగ్గురు సర్వేయర్ల అవసరమవుతారనే వాదన వినిపిస్తోంది.


నగరపాలికలో ఇంత అధ్వాన పరిస్థితి ఉంటే ఎవరికీ పట్టకపోవడం గమనార్హం. తాజాగా జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో సమస్యలు పరిష్కరించలేని పక్షంలో చిన్న మున్సిపాలిటీకి వెళ్లిపోవచ్చని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నగర కమిషనర్‌కు చురకలంటించిన విషయం తెలిసిందే. నగరంలో ఆక్రమణలను త్వరగా తొలగించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆదేశించారు. 50 డివిజన్లు, రూ.4.5లక్షల జనాభా కలిగిన పెద్ద నగరానికి సర్వేయర్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- అనంతపురం క్రైం

ఆక్రమణలో ఓపెనసైట్‌లు, పొరంబోకు భూములు

నగరంలో ఆక్రమణలకు లెక్కే లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా నగరంలో నగరపాలిక స్థలాలను ఆక్రమిస్తూనే ఉన్నారు. దీనిపై కౌన్సిల్‌ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు టౌనప్లానింగ్‌ అధికారులు సమాధానం ఇవ్వలేకపోయారు. గతంలో కార్పొరేషనకు సంబంధించి 280 పైచిలుకు ఓపెన సైట్‌లు ఉండేవనేది అధికారుల అంచనా. అందులో కొన్నింటిని పాఠశాలలు, ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లకు ఇచ్చారు. మిగిలిన వాటిలో చాలా భాగం ఆక్రమించేశారు. ప్రస్తుతానికి 65 స్థలాలకు నగరపాలిక అధికారులు రక్షణ కల్పిస్తున్నట్లు తేలుస్తున్నారు. 20స్థలాలకు పైగా రక్షణ లేనట్లు తెలుస్తోంది. పొరంబోకు స్థలాల విషయంలో ఆక్రమణలకు అంతే లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. ఇక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఉన్న సెంట్రల్‌పార్క్‌ విషయంలో ఆక్రమణలున్నా యనే ఆరోపణలున్నాయి. కానీ ఎంతమంది సర్వేయర్లు తేల్చినా ఎంత భూమి ఆక్రమించారు..?, ఎంత భూమి కార్పొరేషనది ఉందో తేల్చలేక పోయారు. ఆరెకరాల పైచిలుకు భూమిలో 1.6ఎకరాల భూమి లెక్క తేలలేదని ఏసీపీ చెప్పుకొచ్చారు. ఆ భూమి ఆక్రమించారా..?లేక అలాగే ఉందా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. నగరపాలిక పరిధిలో పనిచేసిన సర్వేయర్లందరూ సర్వే చేసిన పనులకు పైసలు వసూలు చేయడంలోనే బిజీగా ఉండేవారు. గతంలో కోటేశ్వరరావు అనే సర్వేయర్‌ రూ.8లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

ఆక్రమణలపై నిజాలు నిగ్గు తేల్చేదెన్నడు...?

నడిమివంక, మరువవంకల చుట్టూ వందల సంఖ్యలో ఆక్రమణలున్నాయి. వీటిపై ఇప్పటికే 500 మందికి పైగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వాటి గురించి సీరియ్‌సగా పట్టించుకుంటున్నారు. వాటితో పాటు నగరంలోని ఆక్రమణలన్నింటిపైనా నిగ్గు తేల్చాలని, ఆక్రమణలను తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్‌ కోరారు. దీంతో వాటిపై విచారణాధికారిగా జేసీని నియమించారు. కానీ ఇక్కడా సర్వేనే అత్యంత కీలకం కానుంది. వంకలను ఎంత దూరం ఆక్రమింఆరు? ఎన్ని ఇళ్లు కట్టారన్నది తేల్చాలంటే సర్వే తప్పనిసరి. సర్వేయర్‌ లేకపోవడంతో ప్రస్తుతం అత్యంత కీలకమైన వాటిని అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌తో అధికారుల విజ్ఞప్తి మేరకు సర్వే చేస్తున్నారట. ఇంత దిక్కుమాలిన పరిస్థితి కార్పొరేషనకు గతంలో ఎన్నడూ లేదని తెలుస్తోంది. కాగా జేసీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ బదిలీ కావడంతో పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందోననే చర్చ మొదలైంది.

సర్వే శాఖకు విన్నవించుకున్నా...

నగరానికి సర్వేయర్‌ కావాలని కార్పొరేషన అధికారులు ఎన్నోసార్లు సర్వే శాఖకు విన్నవించుకున్నా ఫలితం లేదు. నగర కమిషనర్‌, మేయర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు చెప్పుకున్నా సర్వేయర్‌ను నియమించలేకపోయారు. ఏకంగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌(సర్వే శాఖ)ఉన్నతాధికారికి పలు సార్లు లేఖ రాసినా స్పందన లేదని అధికారులంటున్నారు. దీనికి తోడు నిత్యం ప్రజలు తమ భూమి సర్వే చేయించాలని సర్వేయర్‌ ఎక్కడున్నారని, చలానా ఎవరికి చెల్లించాలని అడుగుతున్నారు. సర్వేయర్‌ లేడని దీంతో చలానా కట్టించడం లేదంటూ టౌనప్లానింగ్‌ అధికారులంటున్నారు. దీంతో ప్రజలు చేసేదేమీలేక నిట్టూరుస్తున్నారు.

అందరినీ కోరాం: మహమ్మద్‌ వసీం, నగర మేయర్‌

నగరపాలక సంస్థలో సర్వేయర్‌ పోస్టు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న విషయం వాస్తవమే. నగర ప్రజలు భూ వివాదాలపై సర్వే చేయించాల ని కోరుతున్నారు. ఈ సమస్యను నగర కమిషనర్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అందరి దృష్టికి తీసు కెళ్లాం. టౌనప్లానింగ్‌ అధికారులు సర్వేశాఖకు పలు సార్లు లేఖలు రాశారు. అప్పటికీ సర్వేయర్‌ను నియమించలేదు. త్వరలోనే సర్వేయర్‌ను నియమిస్తాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 11:46 PM