Share News

WATER PROBLEM: కార్మికుల సమ్మెబాట.. నీటి కోసం జనం వెంపర్లాట..!

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:58 PM

ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే శ్రీరామిరెడ్డి, సత్యసాయి శుద్ధి కేంద్రాలు బంద్‌ కావడంతో గ్రామాల్లో ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని 11 రోజులుగా సమ్మె బాట పట్టడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి.

WATER PROBLEM: కార్మికుల సమ్మెబాట.. నీటి కోసం జనం వెంపర్లాట..!
Worker's strike.. People are clamoring for water..!

పొలాల వద్దకు వెళుతున్న గ్రామీణులు

వేసవిని తలపిస్తున్న ఎండలు

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు విఫలం

కూడేరు, సెప్టెంబరు 16: ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే శ్రీరామిరెడ్డి, సత్యసాయి శుద్ధి కేంద్రాలు బంద్‌ కావడంతో గ్రామాల్లో ప్రజలు దాహంతో అల్లాడిపోతున్నారు. నీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని 11 రోజులుగా సమ్మె బాట పట్టడంతో గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఉమ్మడి జిల్లాల్లో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కింద దాదాపు 1100 గ్రామాలు, సత్యసాయి తాగునీటి పథకం కింద 1050 గ్రామాలకు నీటి సరఫరా జరిగేది. ఆ రెండు పథకాల్లో పనిచేసే కార్మికులు సమ్మె బాట పట్టడంతో గ్రామాల్లో తాగునీరు దొరక్క అల్లాడిపోతున్నారు. కూడేరు మండలంలో కొర్రకొడు, చోళసముద్రం, నారాయణపురం, జల్లిపల్లి, ముద్దలాపురం, కూడేరు తదితర గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. శ్రీరామిరెడ్డి తాగునీటి పఽథకం నుంచి ఉరవకొండ నియోజక వర్గ తాగునీటి పథకానికి సరఫరా చేస్తున్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఆ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. దీంతో ఉరవకొండ నియోజక వర్గ పరిధిలోని గ్రామాలకు కూడా తాగునీటి కష్టాలు తప్పలేదు. పంచాయతీ నుంచి సరఫరా అయ్యే నీరు కరెంటు వచ్చినప్పుడే పట్టుకోవాలని.. అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వ్యవసాయ మోటర్లకు కరెంటు వచ్చిన సమయంలో సుదూరంగా ఉన్న తోటలకు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ప్రజలతోపాటు మూగ జీవాలు కూడా దాహంతో అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం పనులు వదులుకొని ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తున్నట్లు మహిళలు తెలిపారు. మూగ జీవాల దాహం తీర్చడానికి కిలోమీటర్ల దూరంలోనున్న తోటల్లోకి ఎద్దుల బండ్లు, ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై వెళ్లి తీసుకువస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలను తీర్చడానికి అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాకాలం వచ్చినా వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. దీంతో నీటి అవసరాలు మరింత ఎక్కువయ్యాయి.

Updated Date - Sep 16 , 2024 | 11:58 PM