Share News

GOVERNER VIST: ప్రపంచ శాంతి వేదిక.. ప్రశాంతినిలయం

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:29 AM

సత్యసాయి అవతరించిన ప్రశాంతినిలయం ప్రపంచశాంతికి వేదికగా మారిందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ పేర్కొన్నారు. సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు శనివారం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంతులో కన్నుల పండువగా జరిగాయి.

GOVERNER VIST: ప్రపంచ శాంతి వేదిక.. ప్రశాంతినిలయం
Governor visiting Mahasamadhi

గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌

ఘనంగా సత్యసాయి జయంతి

పాల్గొన్న దేశ, విదేశాల భక్తులు

పుట్టపర్తి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సత్యసాయి అవతరించిన ప్రశాంతినిలయం ప్రపంచశాంతికి వేదికగా మారిందని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ పేర్కొన్నారు. సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు శనివారం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంతులో కన్నుల పండువగా జరిగాయి. విద్యార్థుల గురువందనం భక్తీగీతాల ఆలపనతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ ప్రసంగిస్తూ సత్యసాయి తన ఆధ్యాత్మిక బోధనలు, సేవలు, ప్రేమతత్వంతో కోట్లాది మందికి ఆరాధ్యదైవమయ్యారని కొనియాడారు. సత్యసాయి అందిస్తున్న విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలు వెలకట్టలేనివన్నారు. వేలాది గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి సత్యసాయి వందల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడానికి సత్యసాయి సేవా సంస్థలు ఎప్పుడు ముందుంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు రాగి మాల్ట్‌ అందిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం గవర్నర్‌ చేతులమీదుగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేశారు. ట్రస్టు ప్రతినిధులతో కలిసి ట్రస్టు వార్షిక నివేదికను విడుదల చేశారు.

ప్రధాని సందేశం

సత్యసాయి జయంతి వేడుకలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని ట్రస్టు సభ్యులు నాగానందం చదివి వినిపించారు. సత్య సాయిబాబా మానవతా మూర్తి అని, ఆయన సేవలు వెలకట్టలేనివని, ము ఖ్యంగా అతిఖరీదైన ఉచిత వైద్యాన్ని అందరికి అందిస్తుండటం ప్రశంసనీయంటూ ప్రధాని సందేశాన్ని చదివి వినిపించారు. ట్రస్టు సభ్యులు గవర్నర్‌కు, మంత్రికి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి మొక్కలు పంపిణీ చేశారు.


పాల్గొన్న వీఐపీలు

సత్యసాయి జయంతి వేడుకల్లో రాష్ట్రమంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారఽథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గీతారెడ్డి, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎ్‌సరాజు, ట్రస్టు సభ్యులు చక్రవర్తి, డాక్టర్‌ మోహన, ప్రసాద్‌, రామసుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ టీఎస్‌ చేతన, అనంతపురం రేంజ్‌ డీఐజీ షిమోషీ, ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ధర్మవరం ఆర్డీఓ మహేశ, పుట్టపర్తి తహసీల్దార్‌ అనుపమ, బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధనరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్‌, సేవాసంస్థల ప్రతినిధులు నిమీ్‌షపాండే, హీరా, కోటేశ్వరరావు, చలం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వడ్డే అంజినప్ప తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి సేవలు 139 దేశాలకు విస్తరణ: మంత్రి

సత్యసాయిబాబా తన సేవలను 139 దేశాలకు విస్తరించారంటూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ కొనియాడారు. 99 సంవత్సరాల కిందట సత్యనారాయణ అవతరించారని, ఆయనే సత్యసాయి బాబాగా తన 14వ ఏట అవతరణ ప్రకటన చేసి ఆధ్యాత్మిక బోధనల ద్వారా గురువుగా పూజలందుకుంటున్నారన్నారు. అంచెలంచెలుగా తన సేవలను ప్రపంచానికి విస్తరించారని పేర్కొన్నారు. నిస్వార్థసేవలకు సత్యసాయి ప్రతి రూపమని అందుకే నేడు ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయికి లక్షలాది భక్తులు ఉన్నారన్నారు. 2020-25 సత్యసాయి స్వర్ణోత్సవాలు నిర్వహించడానికి ముందస్తు ప్రణాళిక చేయడం అభినందనీయమన్నారు. సత్యసాయి శివైక్యం తరువాత సేవలు యథావిధిగా సాగడం అంతా ట్రస్టు కృషేనన్నారు.


కన్నుల పండువగా స్వర్ణరథోత్సవం

ప్రశాంతి నిలయం వీధుల్లో స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా సాగింది. సాయత్రం 5గంటలకు బంగారు రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి పూజలు చేశారు. అనంతరం భక్తిపాటలు పాడుతూ రథోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి సాయికుల్వంతులో లాలంబుడి కృష్ణబృందం సత్యసాయి జోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మల్లాది సోదరులు సంగీత గానంతో భక్తులను అలరించారు. సత్యసాయి జయంతి వేడుకలలో దేశవిదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సేవల ఖర్చు రూ.166 కోట్లు

సత్యసాయి బాబా చేపట్టిన సేవలను మరింత పారదర్శకంగా కొనసాగిస్తున్నామని, ఈ ఏడాది సేవల కోసం రూ.166 కోట్లు ఖర్చు చేసినట్లు ట్రస్టు సభ్యులు నాగానందం పేర్కొన్నారు. రూ.237 కోట్లు రాబడి ఉందన్నారు. వైద్యసేవలకు రూ.100 కోట్లు, క్యాప్టిల్‌ ఖర్చు రూ.32కోట్లు, ఉచిత విద్యుతకు రూ.15కోట్లు, అభివృద్ధి పనులకు రూ.20కోట్లు, ఇతర కార్యక్రమాలకు రూ.28కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. బెంగళూరు వైట్‌ ఫీల్డ్‌ ఆస్పత్రిలో 16500 ఉచిత శస్త్రచికిత్సలు, 2.30లక్షల మందికి పరీక్షలు, మొబైల్‌ ఆస్పత్రి ద్వారా 56వేల మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్లు వివరించారు. ఇవేకాక కాకదేశ వ్యాప్తంగా సేవలను కొనసాగిస్తున్నామన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:29 AM