Share News

Kakkalapalli Colony Panchayat : నువ్వు తిను అన్నా..!

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:17 AM

కక్కలపల్లి కాలనీ పంచాయతీలో పనిచేసిన పలువురు కార్యదర్శులు అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి దోచిపెట్టడమే ధ్యేయంగా వ్యవహరించారు. ఇటివల ఇనచార్జిగా వ్యవహరించిన ఓ కార్యదర్శి ఆ కుటుంబంతో మరింత అంటకాగారు. అభివృద్ధి పనుల ముసుగులో పంచాయతీ ఆదాయాన్ని ఆ కుటుంబానికి కట్టబెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ వాటర్‌ ప్లాంట్‌కు కొత్త సిస్టమ్‌ కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి.. లక్షలాది ...

Kakkalapalli Colony Panchayat : నువ్వు తిను అన్నా..!
Water plant in Pilligundla Colony

పంచాయతీ సొమ్ము దోచిపెట్టిన కార్యదర్శులు

కక్కలపల్లి కాలనీలో అప్పటి ప్రజాప్రతినిధికి..

అనంతపురం రూరల్‌, జూలై 12: కక్కలపల్లి కాలనీ పంచాయతీలో పనిచేసిన పలువురు కార్యదర్శులు అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి దోచిపెట్టడమే ధ్యేయంగా వ్యవహరించారు. ఇటివల ఇనచార్జిగా వ్యవహరించిన ఓ కార్యదర్శి ఆ కుటుంబంతో మరింత అంటకాగారు. అభివృద్ధి పనుల ముసుగులో పంచాయతీ ఆదాయాన్ని ఆ కుటుంబానికి కట్టబెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ వాటర్‌ ప్లాంట్‌కు కొత్త సిస్టమ్‌ కొనుగోలు చేసినట్లు బిల్లు పెట్టి.. లక్షలాది రూపాయలను అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వాటర్‌ సిస్టమ్‌ను ఓ ప్రైవేట్‌ కంపెనీ పంచాయతీకి ఉచితంగా ఇచ్చినట్లు సమాచారం.


ఎవరో ఇచ్చినదానికి..

- పిల్లిగుండ్ల కాలనీలో పంచాయతీ పరిధిలోని వ్యక్తుల ఆధ్వర్యంలో వాటర్‌ ప్లాంట్‌ను నిర్వహించేవారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని వాటర్‌ ప్లాంట్‌ పక్కనే ఉన్న ఆలయ అవసరాలకు, పూజారి గౌరవవేతనానికి వినియోగించేవారు. వాటర్‌ ప్లాంట్‌ ఉన్నది పంచాయతీ స్థలం కావడంతో పంచాయతీ వారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆలయ పూజారికి పంచాయతీ నుంచే గౌరవ వేతనం ఇస్తున్నారని సమాచారం. రెండేళ్ల కిందట ఓ ప్రైవేట్‌ కంపెనీ ప్రతినిధి వాటర్‌ సిస్టమ్‌ కొనుగోలు చేసి.. పంచాయతీకి ఉచితంగా ఇచ్చారు. కానీ ఆ సిస్టమ్‌ను కొనుగోలు చేసినట్లు చూపించారు. పంచాయతీలో బిల్లు పెట్టి.. రూ.2.4 లక్షలను అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యురాలి ఖాతాలోకి జమచేశారు. ఈ తతంగం నడిపించిన కార్యదర్శి.. సచివాలయం పరిధిలోని ఓ మహిళా ఉద్యోగి ఖాతాలోకి రూ.లక్షకు పైగా సొమ్ము జమచేసినట్లు తెలిసింది. కానీ దానికి సంబంధించి పంచాయతీ రికార్డులో లెక్కలు లేవని సమాచారం.

- గతంలో పనిచేసిన మరో కార్యదర్శి కూడా ఇదే తరహాలో పంచాయతీ సొమ్మును బిల్లుల రూపంలో అప్పటి ప్రజాప్రతినిధికి దోచిపెట్టారని ప్రచారం జరుగుతోంది. మరో అధికారి అప్రూవల్స్‌ ముసుగులో కోట్ల రూపాయలు వసూలు చేసి అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఆదాయాన్ని అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబానికి దోచిపెట్టిన కార్యదర్శి.. వారం క్రితం సెలవులో వెళ్లారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 13 , 2024 | 12:17 AM