Share News

ఉద్యోగుల సంఘం నేత..కేఆర్‌ సూర్యనారాయణకు క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:21 AM

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్‌ సూర్యనారాయణకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని నిర్ధారించారు. ఈ విషయాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తెలియజేశారు.

ఉద్యోగుల సంఘం నేత..కేఆర్‌ సూర్యనారాయణకు క్లీన్‌చిట్‌

ఎఫ్‌ఐఆర్‌ నుంచి పేరు తొలగింపు

విజయవాడ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్‌ సూర్యనారాయణకు పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని నిర్ధారించారు. ఈ విషయాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తెలియజేశారు. డీలర్లు, ఏజెన్సీలు, ఆడిటర్ల నుంచి భారీగా ముడుపులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ 2023 జూన్‌లో అప్పటి వైసీపీ ప్రభుత్వం విజయవాడ పటమట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించింది. ఈ కేసులో ఏ-1గా బలిజేపల్లి మెహర్‌కుమార్‌, ఏ-2గా కొచ్చర్లకోట సంధ్య, ఏ-3గా కావూరి వెంకట చలపతి, ఏ-4గా మరీదు సత్యనారాయణ, ఏ-5గా కాశీభట్ల రామ (కేఆర్‌) సూర్యనారాయణ పేర్లను చేర్చుతూ వారిపై ఐపీసీ 167, 409, 477(ఎ), 201, 420, 384, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మెహర్‌కుమార్‌, సంధ్య, వెంకటచలపతి, సత్యనారాయణ విజయవాడ 1 డివిజన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, సూర్యనారాయణ రెవెన్యూ విభాగంలో పనిచేసినప్పుడు జీఎస్టీ చట్టాలను ఉపయోగించుకుని భారీగా వసూళ్లు చేశారని.. దీనివల్ల వాణిజ్య పన్నుల శాఖకు భారీగా నష్టం వాటిల్లిందని అభియోగాలు వచ్చాయని, అంతర్గతంగా నిర్వహించిన విచారణలో అవి నిజమేనని తేలిందని కోర్టుకు వివరించారు. మెహర్‌కుమార్‌, సంధ్య, వెంకటచలపతి, సత్యనారాయణను అప్పటి సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ భాస్కరరావు, పటమట ఇన్‌స్పెక్టర్‌ డి.కాశీవిశ్వనాథ్‌ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సూర్యనారాయణ మాత్రం దొరకలేదు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయపోరాటం చేశారు. ఆయన పాత్రకు సంబంధించి నాడు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇచ్చిన నివేదికను పటమట పోలీసులు పరిశీలించారు. అందులో సూర్యనారాయణ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని నిర్ధారించారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నుంచి ఆయన పేరును తొలగించారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టుకు తెలియజేశారు.

Updated Date - Nov 27 , 2024 | 06:21 AM