Pawan Kalyan : జల్‌జీవన్ మిషన్‌కు నిధులివ్వండి
ABN , Publish Date - Nov 27 , 2024 | 03:14 AM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను వారితో ప్రస్తావించి.. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు.
సురక్షిత తాగునీటికి సహకరించండి
ఏఐఐబీ ప్రాజెక్టుల గడువు పెంచండి
రీయింబర్స్‌మెంట్ కాదు.. రాష్ట్రానికి
ముందస్తు నిధులు ఇచ్చేలా చూడండి
కరువు జిల్లాల్లో ఉపాధి నిధులు పెంచాలి
కొత్త పనులు చేపట్టేందుకూ చాన్సివ్వండి
‘పిఠాపురం’లో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించండి
పర్యాటక ప్రాజెక్టులకు ఊతమివ్వండి
కేంద్ర మంత్రులకు పవన్ వినతులు
ఢిల్లీలో డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన
అమరావతి/న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను వారితో ప్రస్తావించి.. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు. నిధులు, పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి, ఉపాధి హామీ పనులు, రాష్ట్రంలో ‘జాతీయ పర్యాటక యూనివర్సిటీ’ ఏర్పాటు సహా అనేక అంశాలను ప్రస్తావించారు. తొలుత కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. 2019-2024 మధ్య అందించిన కనెక్షన్లలో కొళాయిల సామర్థ్యం, నీటి నాణ్యత అంశంలో సమస్యలు గుర్తించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు లేవని, అలాగే 2.27 లక్షల పంపులు పనిచేయడం లేదని, మరో 24 వేల కొళాయిలకు అవసరమైన నీటిని సరఫరా చేయడం లేదని వివరించారు. జల్‌జీవన్ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, దీనికి కేంద్ర సహకారం అవసరమన్నారు.
అంచనా వ్యయం పెంచాలి!
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపడుతున్న పలు నిర్మాణాలకు అంచనా వ్యయం పెంచడంతో పాటు కొత్త పనులకు అవకాశమివ్వాలని పవన్ కల్యాణ్ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు. ఉపాధి పనుల్లో భాగంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి వంద రోజుల పని దినాలు అదనంగా కల్పించాలని కోరారు. ఉపాధి నిధులతో శ్మశాన వాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహరీల నిర్మాణం, ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేసేందుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. కరువు జిల్లాల్లో చేపట్టే ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90:10 దామాషా ప్రకారం కేటాయింపులు జరపాలని కోరారు.
గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యమివ్వండి
గ్రామీణ రోడ్లను ఆధునికీకరించడానికి పీఎం సడక్ యోజన, ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపడుతున్నట్టు ఉపముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు నిర్మించాలని గుర్తిస్తే, వాటిలో ‘పీఎం గ్రామీణ సడక్’ యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందన్నారు. గ్రామీణ సడక్ యోజన-4 కింద గ్రామాల్లోని అంతర్గతదారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
ప్రాజెక్టు పూర్తికి గడువు పెంచాలి
ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్(ఏఐఐబీ) రుణంతో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువును 2026 డిసెంబరు 31 వరకు పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పవన్ కల్యాణ్ కోరారు. రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిని కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70:30 శాతం విధానం నుంచి 90:10లోకి మార్చాలన్నారు.
తక్షణం ఆర్వోబీ..
రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్‌ను కలిసిన డిప్యూటీ సీఎం.. తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలో సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) అవసరం ఉందని, సత్వరమే దీనిని మంజూరు చేయాలని కోరారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి దేవాలయానికి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వేస్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ నుంచి తిరుపతికి రైలు నడపాలని లాతూర్ ప్రజలు చేసిన విన్నపాన్ని కూడా రైల్వే మంత్రి ముందు ఉంచారు.
ఏపీలో పర్యాటక వర్సిటీ
రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యాటక ప్రాజెక్టులకు సహకరించి, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పవన్ కల్యాణ్ కోరారు. కేంద్ర పర్యాటక శాఖ.. స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాస్కీ) ప్యాకేజీ కింద ప్రతిపాదించిన గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్‌లకు రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ‘స్వదేశీ దర్శన్ 2.0’ కింద రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులను ప్రతిపాదించగా 3ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని, అరకు-లంబసింగి ఏకో టూరిజం, అడ్వెంచర్ కేటగిరిలోకి వచ్చే పర్యాటక ప్రాజెక్ట్ గురించి వివరించారు. కేరళ తరహాలో గోదావరి బ్యాక్ వాటర్‌ను ఉపయోగించుకుని కోనసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. ‘ప్రసాద్’ స్కీమ్‌లో అరసవల్లి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతిలో అత్యాధునిక పర్యాటక భవన్‌కు రూ.80 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పర్యాటక యూనివర్సిటీని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు.
పవన్‌కు ఉపరాష్ట్రపతి విందు
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మంగళవారం సాయంత్రం ఆత్మీయ విందు ఇచ్చారు. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి తంగెళ్ల ఉదయ్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతితో భేటీ భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పవన్ ‘ఎక్స్’లో తెలిపారు. తనకు సమయమిచ్చినందుకు రుణపడి ఉంటానని, ఆయన చాలా విలువైనసలహాలిచ్చారని పేర్కొన్నారు.
నిధులివ్వండి.. అభివృద్ధి బాట పట్టిస్తాం!
పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళితం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎ్‌సఏ) కింద నిధులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. కేంద్రం నుంచి అందాల్సిన ఈ నిధులు 2021 నుంచి కొన్ని కారణాల రీత్యా రాలేదని తెలిపారు. వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రతన్‌సింగ్‌కు విన్నవించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.215.8 కోట్లను కేటాయించాలని ప్రతిపాదనలు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనికి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి, బ్యాక్‌లాగ్ నిధులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ రూ.42.26 కోట్లు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపాదిత నిధుల్లో తొలి విడతగా రూ.107.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ అండ్ పంచాయతీరాజ్‌కి శాశ్వత భవనం లేదని, దాని నిర్మాణానికి రూ.20 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.