ప్రతిభ ఆధారంగానే సీట్ల భర్తీ
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:58 AM
అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది.
కౌన్సెలింగ్‌లో అందరికీ అవకాశం
కర్నూలు, కోనసీమ వైద్య కాలేజీల్లో మెడికల్ సీట్లపై హైకోర్టు ఉత్తర్వులు
విచారణ నేటికి వాయిదా
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది. వీటితోపాటు తమ ఆదేశాలతో కర్నూలు మెడికల్ కాలేజీలో నిలిపి ఉంచిన ఒక సీటును కూడా ప్రతిభావంతులకే కేటాయించాలని తెలిపింది. అదేవిధంగా ఆయా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులందరికీ ఈ 76 సీట్ల భర్తీలో అవకాశం ఇవ్వకుంటే ప్రయోజనం ఉండదని, అంతగా ప్రతిభలేని వారికి ఈ సీట్లు దక్కుతాయని పేర్కొంది.
ఈ ఉత్తర్వుల కాపీలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) డైరెక్టర్, ఎన్టీఆర్ హెల్త్ యునివర్సిటీ రిజిస్ట్రార్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జి. నరేందర్, జస్టిస్ ఎం. కిరణ్మయితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను మంగళవారానికి(నేడు) వాయిదా వేసింది. వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక.. కోనసీమ వైద్య, పరిశోధన కళాశాలలో 25 సీట్లు, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలో 50 సీట్లు పెంచుతూ ఎన్‌ఎంసీ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ 75 సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పెషల్ ‘స్ట్రే వెకెన్సీ’ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి, సీట్లను కేటాయించింది.
ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ నలుగురు విద్యార్ధులు సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వై. ఠాగూర్‌యాదవ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన రెగ్యులర్ కౌన్సెలింగ్‌లో ఇద్దరు పిటిషనర్లు బీడీఎస్, యాజమాన్య కోటా కింద మరో ఇద్దరు ఎంబీబీఎస్ సీట్లు పొందారన్నారు. పెరిగిన 75 సీట్లకు పిటిషనర్లను అనుమతించకుండా స్ట్రే వెకెన్సీ విధానంలో భర్తీ చేయడం వల్ల తక్కువ మార్కులు వచ్చినవారికి కాంపిటెంట్ కోటా కింద ఎంబీబీఎస్ సీట్లు దక్కుతున్నాయని వివరించారు. ఎన్టీఆర్ హెల్త్ యునివర్సిటీ తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ.. పెరిగిన సీట్లను ‘స్ట్రే వెకెన్సీ’ విధానంలో భర్తీ చేయాలని ఎన్‌ఎంసీనే ఆదేశించిందన్నారు.