Andhra University : ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:00 AM
రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్ టెస్ట్ (ఏపీ పీజీసెట్-2024) ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు.
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్ టెస్ట్ (ఏపీ పీజీసెట్-2024) ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 34 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 10 నుంచి 13 తేదీల మధ్య 24 కేంద్రాల్లో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 33,865 మంది దరఖాస్తు చేసుకోగా 29,908 మంది హాజరయ్యారు.
18,467 మంది (61.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పీజీ సెట్‌కు 11,359 మంది పురుషులు హాజరుకాగా 6,736 మంది (59.30 శాతం), 18,549 మంది మహిళలు హాజరుకాగా 11,731 మంది (63.24 శాతం) అర్హత సాధించారు. ఇక, వర్సిటీల వారీగా చూస్తే ఏయూ పరిధిలో 21,606 మందికి 13,108 మంది (60.67 శాతం), శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 7,775 మందికి 4,950 మంది (63.67 శాతం), ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 204 మందికి 158 మంది (77.45 శాతం) అర్హత సాధించారు. ఇతర ప్రాంతాల నుంచి 323 మంది హాజరు కాగా 251 మంది (77.71 శాతం) అర్హత సాధించారు.