Share News

Amaravati : గనుల వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు

ABN , Publish Date - Sep 13 , 2024 | 03:21 AM

మాజీ సీఎం జగన్‌ అండతో గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ గురువారం కేసు నమోదు చేసింది.

Amaravati : గనుల వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు

  • ఇసుక అక్రమాలు రూ.2500 కోట్లపైనే

  • కుట్రదారు, సూత్రధారి ఆయనే

  • కుట్ర, అవినీతి, దోపిడీలో ఏ1గా నమోదు.. త్వరలో అరెస్టు!

  • మరో ముగ్గురిపైనా కేసు..

  • త్వరలో అరెస్ట్‌ చేసే అవకాశం

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ అండతో గనుల శాఖను సొంత సామ్రాజ్యంగా మలుచుకున్న అప్పటి డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిపై అవినీతి నిరోధక శాఖ గురువారం కేసు నమోదు చేసింది. కుట్ర, అవినీతి, దోపిడీ కేసులో తొలి నిందితుడు (ఏ1)గా ఆయన పేరును చేర్చింది. మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. వీరిలో గనుల శాఖలో మరో కీలక అధికారి పేరు ఉన్నట్లు తెలిసింది. ఇసుక కాంట్రాక్ట్‌ చేసిన జేపీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మరో ఇద్దరి పేర్లను కూడా త్వరలో చేర్చనున్నట్లు తెలిసింది. ఇసుక వ్యవహారంలో దాదాపు రూ.2500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిని త్వరలో అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. విచారణకు హాజరు కావాల్సిందిగా తొలుత ఆయనకు అవినీతి నిరోధక చట్టం(పీసీ) కింద నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే వెంకటరెడ్డి నివాసంలో ఉంటున్నట్లు నిఘావర్గాలు గుర్తించినట్లు తెలిసింది. ఏసీబీ వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేయాలనుకుంటే ఎవరి అనుమతి పొందాల్సిన అవసరం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 31న వెంకటరెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన సాధారణ వ్యక్తిగానే ఉంటున్నారు. కాబట్టి ఆయన అరెస్ట్‌కు రక్షణ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌ ప్రభుత్వంలో వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌గా, ఏపీఎండీసీ ఎండీగా పనిచేశారు. ఉచిత ఇసుక స్థానంలో అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2021-23 సంవత్సరానికి టెండర్‌లు పిలిచి జేపీ వెంచర్స్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. టెండర్‌లో అక్రమాలు జరిగాయని, ఇసుక దోపిడీ జరిగిందని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారని టీడీపీ కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఏసీబీ విచారణకు ఆగస్టులో ఆదేశించింది.


ఏసీబీ నెలన్నర పాటు జిల్లాల వారీగా ఇసుక వ్యవహారాలపై విచారణ జరిపి,ంది. గనుల శాఖ ప్రధాన కార్యాలయంలోని టెండర్ల రికార్డులను పరిశీలించింది. టెండర్ల నిర్వహణ, ఇసుక కాంట్రాక్ట్‌, అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని.. అంతా కుట్రపూరితంగా జరిగిందని, అధికార దుర్వినియోగం, అవినీతి, ఆశిత్ర పక్షపాతం, ఇతర అక్రమాలకు పాల్పడ్డారని తాజాగా గుర్తించింది. 1957 నాటి గనుల చట్టాన్ని ఉల్లంఘించి మరీ అక్రమాలకు పాల్పడ్డారని కీలక ఆధారాలను సేకరించింది.

ఇసుక కుంభకోణంలో కుట్రదారులు, సూత్రధారుల్లో వెంకటరెడ్డి ప్రధాన వ్యక్తి అని ఏసీబీ గుర్తించింది. ఆయన తొలి నిందితుడి(ఏ1)గా కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 7, 9, 10, 12, 13, ఐపీసీ 30(బీ) కింద కుట్ర, సెక్షన్‌ 420ను నమోదు చేసింది. గనుల కన్సెషన్‌ రూల్స్‌, రెగ్యులేషన్‌ చట్టం-1957లోని 4సెక్షన్‌లను నమోదు చేసినట్లు తెలిసింది. ఇసుక కాంట్రాక్టులో జరిగిన కుట్ర, అక్రమాలు ఏమిటో ఏసీబీ గుర్తించింది. ఇక మిగిలిందల్లా ఆ అంశాలపై వెంకటరెడ్డితో నిర్ధారణ చేసుకోవడమే. గనుల శాఖలోనే మరో కీలక అధికారిపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. వెంకటరెడ్డి ఆదేశాలతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన ఆ అధికారిని కూడా విచారణకు పిలవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ అధికారి గనుల శాఖలో అత్యంత కీలక స్థానంలో ఉన్నారు. వెంకటరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఇసుక అంశంలో చక్రం తిప్పారు. ఆ అధికారి వెంకటరెడ్డితో సమానంగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులున్నాయి. జిల్లాల పర్యటన వెళ్లిన సమయంలో ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది.

  • వెంకటరెడ్డి నివాసాల్లో సోదాలు

తిరుపతి, చెన్నై, హైదరాబాద్‌లో ఉన్న వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం రాత్రి ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. కాగా తనను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని కోరుతూ వెంకటరెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Sep 13 , 2024 | 03:22 AM