Share News

చంద్రబాబు కేసు ఫైలులో మార్పులు?

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:15 AM

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైబర్‌నెట్‌ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైలులో మార్పులు, చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) చైర్మన్‌ జీవీరెడ్డి సందేహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు కేసు ఫైలులో మార్పులు?

సందేహం వ్యక్తం చేసిన జీవీ రెడ్డి

విజయసాయి సిఫారసు చేసిన మహిళా ఉద్యోగి చేతికి ఫైబర్‌నెట్‌ ఫైలు

ఆనాడు అడ్డగోలు నియామకాలు

సిఫారసులు, వాట్సాప్‌ మెసేజ్‌లతో 1,200 మందికిపైగా కొలువులు

వైసీపీ నేతల ఇళ్లలో పనిమనుషులు, కారు డ్రైవర్లుగా పనిచేయించుకున్నారు

నెలకు రూ.4 కోట్ల వేతనాలు

1,863 వ్యూస్‌ వచ్చిన వర్మ వ్యూహం.. సినిమాకు ఏకంగా 2.15 కోట్ల చెల్లింపు

సంస్థపై మొత్తం 1,262 కోట్ల భారం

అన్నింటిపై విజిలెన్స్‌ విచారణ చేస్తాం

ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ వెల్లడి

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైబర్‌నెట్‌ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైలులో మార్పులు, చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) చైర్మన్‌ జీవీరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫైలులో కొత్తగా ఏమైనా రాశారా లేదా తొలగించారా అనే అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అత్యంత కీలకమైన ఈ ఫైలును వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సిఫారసుతో ఉద్యోగంలో చేరిన మహిళ చేతిలో ఎందుకు ఉంచారో అర్థంకావడం లేదన్నారు. ఆమెకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కూడా ఇవ్వలేదని, కేవలం వాట్సాప్‌ మెసేజ్‌ ఆధారంగానే విధులు అప్పగించి, అధికారులు జీతం చెల్లిస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆమె ఉద్యోగంలో కొనసాగారని, ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. గురువారం ఫైబర్‌నెట్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కీలకమైన ఫైలును ఆ మహిళా ఉద్యోగికి అప్పగించిన అధికారులపై చర్యలు ఉండవా అన్న ప్రశ్నకు.. అన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

అక్రమంగా నియామకాలు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫైబర్‌నెట్‌ మానస పుత్రిక అని జీవీరెడ్డి అభివర్ణించారు. గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించాలన్న లక్ష్యంతో కేబుల్‌, ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌తో కూడిన వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఫైబర్‌నెట్‌ స్థాపించినప్పుడు కేవలం 108 మంది సిబ్బందితో నెలకు రూ.40 లక్షలు జీతభత్యాలుగా చెల్లించారని వివరించారు. అలాంటిది.. గత వైసీపీ ప్రభుత్వంలో మార్గదర్శకాలు, నియమ నిబంధనలు లేకుండా సిఫారసులు, వాట్సాప్‌ మెసేజ్‌లతో ఉద్యోగుల సంఖ్యను 1,360కు పెంచారని వెల్లడించారు. ఈ 1,360 మంది ఉద్యోగులకు నెలకు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాల్సిన దుస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. చాలామంది ఉద్యోగులు కార్యాలయానికి రాకుండా, వైసీపీ నాయకుల ఇళ్లలో పనిమనుషులుగా, కారు డ్రైవర్లుగా పనిచేశారని తెలిపారు. ఇలా అక్రమంగా జరిగిన నియామకాలపై చర్యలు చేపడుతున్నామని, లెక్కాపత్రం లేకుండా సంస్థలో చేరిన ఉద్యోగులందరినీ తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో పత్రికా ప్రకటన ఇచ్చి, ఇంటర్వ్యూలను నిర్వహించాకే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. ఎన్నికలకు ముందు నిధులన్నీ విత్‌డ్రా చేసుకుపోయారని, ఫైబర్‌నెట్‌పై రూ.1,262కోట్ల అప్పును భారంగా వేశారని చెప్పారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతో ఫైబర్‌నెట్‌ దివాలా తీసిందన్నారు.


‘వ్యూ’హంపై విచారణ

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన ‘వ్యూహం’ సినిమాకు రూ.2.15 కోట్లు ఫైబర్‌నెట్‌ చెల్లించిందని జీవీ రెడ్డి తెలిపారు. వ్యూస్‌ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని వివరించారు. వ్యూహం సినిమాకు కేవలం 1,863 వ్యూస్‌ వచ్చాయని తెలిపారు. ఈ లెక్కన ఒక్కో వ్యూకు 11,000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని వివరించారు.

సంపూర్ణ ప్రక్షాళన

ఫైబర్‌గ్రిడ్‌ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక వాటి వివరాలు బహిర్గతం చేస్తామని జీవీరెడ్డి తెలిపారు. 2019 నుంచి 2024 దాకా జరిగిన అక్రమాలన్నింటిపైనా సమగ్ర విచారణ జరుగుతోందని వెల్లడించారు. గతంలో ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ మీడియా సమావేశాలకు సంస్థ ఎండీ హాజరయ్యేవారని, ఇప్పుడు ఎందుకు రాలేదన్న ప్రశ్నకు.. మంత్రివర్గ సమావేశం ఉన్నందున ఎండీ దినేశ్‌కుమార్‌ హాజరు కాలేకపోయారని వివరించారు. ఫైబర్‌నెట్‌ను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు.

Updated Date - Dec 20 , 2024 | 04:15 AM