Liquor Revenue : ‘ధర’ఖాస్తుల ఆదాయం 1,312 కోట్లు
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:27 AM
మద్యం పాలసీ అమలులోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి.
మద్యం షాపులకు 65,629 దరఖాస్తులు
నేడే చివరి రోజు.. ఇంకా పెరిగే అవకాశం
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మద్యం పాలసీ అమలులోకి రాకముందే దరఖాస్తు రుసుము రూపేణా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 3,396 షాపులకు గురువారం సాయంత్రానికి 65,629 దరఖాస్తులు వచ్చాయి. వీటిద్వారా రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. కనీసం మరో 15వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. రూ.1,600 కోట్లు కేవలం దరఖాస్తు రుసుముల రూపంలోనే వస్తుంది.
తొలుత లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేసినా.. రాజకీయ ప్రమేయం కారణంగా తొలి ఐదారు రోజులు నామమాత్రంగా దరఖాస్తులు వచ్చాయి. ఇది ఎక్సైజ్ అధికారులను కలవరపెట్టింది. ఈ విషయం సీఎం దృష్టికి రావడంతో ఆయన వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు. దరఖాస్తుదారులను అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో సోమవారం నుంచి దరఖాస్తులు భారీగా పెరిగాయి. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఆ సంఖ్య ఇంకా పెరిగి భారీగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాల కోసం విదేశాల నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయని, యూఎస్ నుంచి తుని పరిధిలోని షాపులకు 20కిపైగా దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళీ తెలిపారు.