Share News

అపార్‌కు ఆధార్‌ ఇబ్బందులు

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:10 AM

పాఠశాలల్లో ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) ఐడీల తయారీ పెద్ద తలనొప్పిగా మారింది. విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీల్లో ఉన్న వ్యత్యాసాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌ తీసుకోకపోవడంతో అపార్‌ ఐడీల సృష్టి అసాధ్యంగా మారింది.

అపార్‌కు ఆధార్‌ ఇబ్బందులు

  • ఆధార్‌, పాఠశాల రికార్డుల్లో వ్యత్యాసం

  • రాష్ట్రవ్యాప్తంగా 77 శాతం మందికే అపార్‌

అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) ఐడీల తయారీ పెద్ద తలనొప్పిగా మారింది. విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీల్లో ఉన్న వ్యత్యాసాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌ తీసుకోకపోవడంతో అపార్‌ ఐడీల సృష్టి అసాధ్యంగా మారింది. ఇప్పటివరకూ 77 శాతం మంది విద్యార్థులకే అపార్‌ ఐడీలు సృష్టించారు. మిగిలిన వారికి ఇప్పట్లో ఐడీలు చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అయితే ఈ ఐడీల తయారీకి పాఠశాల విద్యాశాఖ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు అపార్‌ ఐడీలు తయారు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. పాఠశాలల్లో చేరిన నాటి నుంచి ఉన్నత విద్య పూర్తిచేసేవరకూ వారికి శాశ్వతంగా ఒక ఐడీ ఉండాలనే ఉద్దేశంతో అపార్‌ ఐడీలను తీసుకొచ్చింది. రాష్ర్టాలు ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అపార్‌ ఐడీలు తయారు చేస్తున్నాయి.

అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖలో అపార్‌ ఐడీల సృష్టి ప్రారంభించిన రోజు నుంచీ ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. విద్యార్థుల పేర్లు పాఠశాల రికార్డుల్లో ఒక విధంగా, ఆధార్‌ కార్డుల్లో మరోవిధంగా ఉంటే వెబ్‌సైట్‌ వాటిని తీసుకోవట్లేదు. దాన్ని పరిష్కరించేందుకు టీచర్లు జనన ధృవీకరణ పత్రం తీసుకురావాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. దాంట్లోనూ ఏవైనా తేడాలుంటే ఐడీ క్రియేట్‌ చేయడం సాధ్యం కావట్లేదు. ఆధార్‌ తీసుకునే సమయంలో చాలా తప్పులు దొర్లుతున్నాయి. ఆధార్‌ కార్డులు జారీలో అప్పట్లో హడావిడిగా పేర్లు నమోదుచేశారు. పుట్టిన తేదీల్లోనూ తప్పులు నమోదు చేశారు. ఇప్పుడు వాటిని సరిదిద్దడం ఇబ్బందిగా మారింది. ఆధార్‌లో తప్పులు సరిదిద్దాలంటే జనన ధృవీకరణ పత్రం అవసరం. అది లేని విద్యార్థులు ఏంచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా దీన్ని నిలిపివేసింది.

Updated Date - Dec 06 , 2024 | 04:10 AM