Share News

APSRTC: గమ్యంలేని పయనం!

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:02 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి రథచక్రం దారి తప్పింది! డ్రైవర్‌ లేని బస్సు తరహాలో గమ్యంలేని ప్రయాణం చేస్తోంది!! కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటికి రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి.

APSRTC: గమ్యంలేని పయనం!

ఆర్టీసీలో ఎండీ నుంచి డీఎం వరకూ ఇన్‌చార్జిలే దిక్కు

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా ఈడీల్లేరు

సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఆర్‌ఎం లేని దుస్థితి

40 డిపోల్లో మేనేజర్లు ఇన్‌చార్జిలే.. భారీగా డ్రైవర్ల కొరత

పర్యవేక్షణ కరువై ఆక్యుపెన్సీపై ప్రభావం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి రథచక్రం దారి తప్పింది! డ్రైవర్‌ లేని బస్సు తరహాలో గమ్యంలేని ప్రయాణం చేస్తోంది!! కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటికి రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి. కొత్త బస్సులు వస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం అవి ఎప్పటికి వస్తాయో చెప్పలేకపోతోంది. అసలు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాల గురించి ఆలోచించే అధికారులే కరువయ్యారు. సంస్థల్లో డిపో మేనేజర్ల నుంచి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల వరకూ ఇన్‌చార్జిలే.. ఆఖరికి సంస్థ ఎండీ కూడా ఆర్నెళ్లుగా ఇన్‌చార్జే!! దీంతో పండగ ప్రయాణికుల బస్సులే కాదు.. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు పైనా పూర్తిస్థాయి కసరత్తు జరగలేదు. ప్రభుత్వంలో విలీనం తర్వాత అన్నీ బాగుంటాయనుకుంటే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నా సేవలు అందించడంలో వారిని సంతృప్తి పరచలేక పోతోందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది.

పూర్తిస్థాయి అధికారులు లేక..

రాష్ట్రంలో 11,500 బస్సులతో ప్రతి రోజూ 45లక్షల మేర తిరుగుతూ 65లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద రవాణా సంస్థ ఆర్టీసీ రోజురోజుకూ ప్రయాణికులకు దూరమవుతోంది. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ప్రభుత్వ రంగ ప్రయాణ సంస్థ సక్రమంగా నడవాలంటే డ్రైవర్‌ లాంటి ఎండీ ముందుగా కష్టపడాలి. ఆర్నెళ్ల క్రితం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమల రావు.. వారానికి ఒక రోజు కూడా ఆర్టీసీ వైపు చూడట్లేదు. ఆయనకు రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్యలపై దృష్టి సారించడానికే సమయం సరిపోవడంలేదు. ఆయన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సంస్థను సజావుగా నడిపించాలి. ఈడీ అడ్మిన్‌, ఈడీ ఆపరేషన్స్‌ ఆర్టీసీ హౌస్‌కు వచ్చి కొన్ని నెలలు అవుతోంది. అనుభవం తక్కువగా ఉన్న వారికి సరైన సూచనలు చేసేవారూ లేరు. ఉత్తరాంధ్ర ఈడీ విజయ్‌ కుమార్‌, విజయవాడ ఈడీ విజయరత్నం, కడప ఈడీ చంద్రశేఖర్‌ ఇన్‌చార్జిలే. నెల్లూరు తప్ప రెగ్యులర్‌ ఈడీలు లేకుండా వ్యవస్థను నడిపిస్తున్న ఆర్టీసీకి అసలు ఈడీల వ్యవస్థ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. పోనీ రీజినల్‌ మేనేజర్లయినా ఉన్నారా? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతోపాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం లాంటి చోట్ల కూడా ఆర్‌ఎంలు లేరు. కీలకమైన ప్రాంతాల్లో ఇన్‌చార్జిలతోనే బండి నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. కనీసం 40డిపోల్లో డీఎంలకు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చిందంటే ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతోంది. డిపో మేనేజర్‌కు పని ఎక్కువగా ఉంటుంది. అటువంటి పోస్టుల్లోనూ ఇన్‌చార్జిలను నియమిస్తే ప్రయాణికులకు సేవ చేయడం సాధ్యమేనా? అని ఆర్టీసీ హౌస్‌లోనే ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.


ఆర్టీసీ హౌస్‌లో ఇలా..

ఇక ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పరిస్థితి మరీ అధ్వానం. పదేళ్లకు పైగా ఉద్యోగులు ఇక్కడే తిష్ఠ వేసుకు కూర్చున్నారు. వారిని బదిలీ చేసి అక్కడికి ఇంకొకరిని తీసుకొచ్చే ఆలోచన కూడా ఉన్నతాధికారులు లేరు. అటు విజయనగరంలో పనిచేసే ఉద్యోగులంతా విశాఖపట్నం నుంచే తిరుగుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తర్వాత సిబ్బందిలోనూ అలసత్వం ఎక్కువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఆగిపోతాయో తెలియని డొక్కు బస్సులు.. ఏది అడిగినా పట్టించుకోని సిబ్బంది.. వారిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఇన్‌చార్జిలు కావడం, పూర్తిస్థాయిలో పట్టులేకపోవడం.. ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోతోంది. ఎక్కడి కక్కడ ఓల్వో బస్సులు ఆగిపోతుండటంతో ఆర్టీసీలో ప్రయాణమంటేనే ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు.

డ్రైవర్‌ లేరని బస్సు సర్వీసు రద్దు!

ఆర్టీసీ చైర్మన్‌ సొంత జిల్లాలో డ్రైవర్‌ లేక ఇటీవల శ్రీశైలం బస్సు సర్వీసును రద్దు చేశారు. మరొకరిని ఏర్పాటు చేయలేకపోయిన అక్కడి డీఎం.. ప్రయాణికులకు రిజర్వేషన్‌ డబ్బులు వాపసు చెల్లించారు. ఆ సమయంలో మరో ప్రైవేటు వాహనాల్లో వెళ్లలేక, ప్రయాణం రద్దు చేసుకోలేక ఇబ్బంది పడ్డవారు సోషల్‌ మీడియాలో ఆర్టీసీ సేవల్ని ఏకిపారేశారు. ఇలాంటివి ఆక్యుపెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డ్రైవర్ల కొరత ఉందని చెబుతోన్న యాజమాన్యం నియామకాలు చేసుకోదు. ఉన్న డ్రైవర్లకు అనారోగ్యమంటూ కొందరు అసోసియేషన్ల నేతలు ‘స్వలాభం’ కోసం ఓడీలు ఇప్పించే పనిలోనే ఉంటారు. ఆఖరికి ఆర్టీసీ సెక్యూరిటీ అధికారి కూడా డీజీపీ కార్యాలయంలో ఉంటారు. ఆర్టీసీ హౌస్‌లో విధులు నిర్వర్తించాల్సిన ఆయనకు అక్కడేంపని అని అడిగేవారు కూడా లేరు. విజిలెన్స్‌ విభాగం ఎంతమేర నిఘా పెట్టింది.. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని అడిగితే అసలు ఐపీఎస్‌ అధికారి లేక ఎన్నిసంవత్సరాలైందో అనే సమాధానం వస్తోంది. విజిలెన్స్‌ నివేదికపై చర్య తీసుకోవాల్సిన ఈడీ పరిధిలో ఆ విభాగం పని చేయడం మరో వింత. కొత్త సంవత్సరంలో అయినా కొత్త బస్సులు, అవసరమైన సేవలు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 04:02 AM