Share News

నెయ్యి వైష్ణవిది.. సరఫరా చేసింది ఏఆర్‌ డెయిరీ!

ABN , Publish Date - Nov 27 , 2024 | 04:55 AM

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఏఆర్‌ డెయిరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ బృందం నిర్ధారణకు వచ్చింది.

నెయ్యి వైష్ణవిది.. సరఫరా చేసింది ఏఆర్‌ డెయిరీ!

  • టోల్‌గేట్ల సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించిన సిట్‌

  • ట్యాంకర్‌ డ్రైవర్లనూ విచారించే అవకాశం

  • సీబీఐ డైరెక్టర్‌తో సిట్‌ సిబ్బంది వీడియో కాన్ఫరెన్సు

  • దర్యాప్తు పురోగతిపై సమీక్షించిన సీబీఐ డైరెక్టర్‌

  • ఐజీ త్రిపాఠీకి నివేదిక అందజేయనున్న అధికారులు

తిరుపతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీతో ఏఆర్‌ డెయిరీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి.. తన ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ బృందం నిర్ధారణకు వచ్చింది. విచారణలో సేకరించిన సమాచారాన్ని అందించేందుకు మంగళవారం సిట్‌ అధికారులు సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. దర్యాప్తు నివేదికను సిట్‌ కీలక అధికారైన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీకి సిట్‌ సిబ్బంది పంపింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్‌ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరాపై ఈ ఏడాది ప్రారంభంలో టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. దానికనుగుణంగా ఏఆర్‌ డెయిరీనే టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి. అయితే ఏఆర్‌ డెయిరీ తన ట్యాంకర్లను వైష్ణవి డెయిరీకి పంపి, అక్కడ నెయ్యి నింపుకుని టీటీడీకి సరఫరా చేసినట్టు ఆధారాలు లభించాయి. ఏఆర్‌ డెయిరీ నుంచి సేకరించిన రికార్డులు, దిండిగల్‌ నుంచి ట్యాంకర్ల రాకపోకలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ ట్యాంకర్లకు జీపీఆర్‌ఎస్‌ అమర్చారా.. లేదా? అన్నదానిపైనా దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ట్యాంకర్లు రాకపోకలు సాగించిన మార్గాల్లోని టోల్‌గేట్ల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీలను సిట్‌ అధికారులు సేకరించారు. ఆ మార్గంలోని చెక్‌పోస్టుల నుంచీ ఆధారాలు తీసుకున్నారు. వాటి ఆధారంగా ట్యాంకర్ల నంబర్లు, వాటిని నడిపిన డ్రైవర్లను గుర్తించారు. దీనిపై డ్రైవర్లను కూడా విచారించాలని సిట్‌ అధికారులు భావిస్తున్నారు.


  • చెన్నై ల్యాబ్‌ క్వాలిటీ అనలిస్టులను ప్రశ్నించే అవకాశం

ఏఆర్‌ డెయిరీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను నిర్ధారిస్తూ సర్టిఫికెట్‌ జారీ చేసిన చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ నిర్వాహకులను కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. నెయ్యి నాణ్యతను నిర్ధారించిన క్వాలిటీ అనలిస్టులను కూడా ప్రశ్నిస్తారు. అయితే వారిని తిరుపతి పిలిపించి విచారిస్తారా లేక సిట్‌ అధికారులే చెన్నై వెళతారా అన్నది తెలియరాలేదు.

  • సీబీఐ డైరెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్సు

తిరుపతి అలిపిరి సమీపంలోని సిట్‌ కార్యాలయం నుంచీ విచారణ అధికారులు ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌తో మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ జరిగిన ఈ సమావేశంలో ఇప్పటివరకూ విచారణ జరిపిన తీరు, సేకరించిన సమాచారం, గుర్తించిన అంశాలు, నిర్ధారించిన ఉల్లంఘనలు వంటివన్నీ విచారణ అధికారులు డైరెక్టర్‌కు నివేదించినట్టు తెలిసింది. తదుపరి విచారణలో తెలుసుకోవల్సిన విషయాలు, సేకరించాల్సిన సమాచారం గురించి విచారణ అధికారులకు డైరెక్టర్‌ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. సమావేశం అనంతరం దర్యాప్తు పురోగతిపై రూపొందించిన నివేదికను ఏపీ పోలీసు తరపున కీలక అధికారిగా ఉన్న ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీకి అందజేసేందుకు డిఎస్పీ స్థాయి అధికారి విజయవాడ వెళ్లినట్టు తెలిసింది.

  • సిట్‌ కార్యాలయం వద్ద భద్రత

తిరుపతిలోని అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్సు ఆవరణలో ఏర్పాటైన సిట్‌ కార్యాలయానికి ప్రభుత్వం భద్రత కల్పించింది. కార్యాలయంలో అవసరమైన సదుపాయాలన్నీ మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయి. విచారణ అధికారులు మంగళవారం పూర్తిగా కార్యాలయంలోనే గడిపారు. కార్యాలయం సమీపానికి ఎవరినీ అనుమతించడం లేదు. కార్యాలయానికి భద్రతగా పోలీసు బలగాలను నియమించారు.

Updated Date - Nov 27 , 2024 | 04:55 AM