సిట్ దూకుడు.. ఈవోతో భేటీ
ABN , Publish Date - Sep 30 , 2024 | 04:15 AM
తిరుమల లడ్డూ వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. నెయ్యి మూలాల నుంచి శూలశోధన చేస్తోంది.
నెయ్యి మూలాల నుంచి శూల శోధన
కల్తీ విచారణలో పకడ్బందీగా అడుగులు
అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులిస్తాం: సిట్ చీఫ్
విజిలెన్స్, ల్యాబ్ నివేదికలపై అధ్యయనం
ఏఆర్ ఫుడ్స్ పుట్టు పూర్వోత్తరాలపై దృష్టి
ట్యాంకర్ డ్రైవర్ నుంచి యజమాని వరకూ
విచారించనున్న సిట్ సభ్యులు
ప్లాంట్‌లో ఉత్పత్తి, పదార్థాలపైనా దర్యాప్తు
బాధ్యులైన అందరినీ ప్రశ్నిస్తామన్న సిట్ చీఫ్
దుండిగల్ వెళ్లి ఏఆర్ ఫుడ్స్‌పై విచారణ
టీటీడీ ఈవోతో సిట్ బృందం భేటీ
కల్తీ నెయ్యి వివాదం కుట్ర కోణంపై చర్చ
అమరావతి/తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. నెయ్యి మూలాల నుంచి శూలశోధన చేస్తోంది. కల్తీ అంశంపై విచారణలో పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుపతికి చేరుకున్న సిట్ సభ్యులు ఆదివారం ఎక్కడికీ వెళ్లలేదు. తిరుపతిలోనే సమావేశమయ్యారు. కల్తీ నెయ్యిపై విజిలెన్స్, ల్యాబ్ నివేదికల్లోని అంశాలు, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలనూ పరిశీలించారు. సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఏఆర్ ఫుడ్స్ కంపెనీ చరిత్రపై ఆరా
కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు, దాని చరిత్ర ఏమిటి? యజమాని ఎవరు? వంటి విషయాలపై దృష్టి సారించారు. తిరుమలకు కల్తీ నెయ్యి తీసుకొచ్చిన ట్యాంకర్ డ్రైవర్ నుంచి కంపెనీ యజమాని వరకూ సిట్ సభ్యులు ప్రశ్నించనున్నారు. వారికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేయనున్నారు. ప్లాంట్‌లో ఏమి ఉత్పత్తి చేస్తున్నారు? నెయ్యి కాకుండా ఇతర పదార్థాలు ఏమైనా తయారు చేస్తున్నారా? నెయ్యిలో వనస్పతి ఉత్పత్తులు, జంతు కొవ్వులు కల్తి చేశారా? వంటి విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. అలాగే ప్లాంట్ తయారీ సామర్థ్యం ఎంత? పాలసేకరణ, నెయ్యి తయారీ ప్రక్రియపై కూపీ లాగనున్నారు. తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాలంటే అంతకుముందు ఏడాది నుంచి ప్లాంట్ రన్నింగ్‌లో ఉండాలి. ఆ ఏడాది ప్లాంట్‌లో ఏ మేరకు ఉత్పత్తి చేశారు? బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? వంటి అంశాలపైనా సిట్ సభ్యులు దర్యాప్తు చేయనున్నారు.
దుండిగల్‌కు సిట్
తమిళనాడులోని దుండిగల్‌లో ఉన్న ఏఆర్ ఫుడ్స్ ప్లాంట్ నుంచి తిరుమలకు నెయ్యి తీసుకొచ్చిన ఓ ట్యాంకర్ రిజెక్ట్ కాగా అందులోని నెయ్యిని మరో ట్యాంకర్‌లో నింపి మళ్లీ తిరుమలకు తీసుకొచ్చారు. దీనిపై కూడా సిట్ సభ్యులు దృష్టి సారిస్తున్నారు. సిట్ సభ్యులు రెండు బృందాలుగా విచారణ చేయనున్నారు. ఓ బృందానికి డీఐజీ గోపీనాథ్ జెట్టి, మరోదానికి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు సారథ్యం వహిస్తున్నారు. సిట్ చీఫ్ త్రిపాఠి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ పాలకమండలి పెద్దలు, అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలను మరోసారి పరిశీలించనున్నారు. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు: త్రిపాఠి
ఆదివారం తిరుపతి పోలీసు గెస్ట్ హౌస్ వద్ద సిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి మీడియాతో మాట్లాడారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో నమోదైన క్రైం నంబరు 470-24 కేసులో సమగ్ర విచారణ చేసి దోషులను గుర్తిస్తామన్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తామని, ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఏఆర్ డెయిరీకి సంబంధించిన వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్టు చెప్పారు. అసలు ఏఆర్ డెయిరీకి టెండర్లు ఎప్పుడు కట్టబెట్టారు? ఇప్పటివరకు ఎంత నెయ్యి సరఫరా చేశారు? అన్న విషయాలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టామన్నారు. త్వరలో తమిళనాడులోని దుండిగల్‌కు వెళ్లి ఏఆర్ డెయిరీ సామర్థ్యం, అక్కడ ప్లాంట్ నిర్వహణ తీరు, ఎన్ని వేల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేస్తున్నారు? టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం ఆ డెయిరీకి ఉందా? అనే కోణంలో విచారణ చేపడతామని తెలిపారు. కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని విభాగాల అధికారులను విచారిస్తామన్నారు. అవసరమైతే టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచి టెండర్ల విధానంలో చోటు చేసుకున్న లోపాలపై విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలోనే విచారణ సాగుతుందన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలోనూ అన్ని రికార్డులు పరిశీలించి సంబంధం ఉన్న వారిని విచారిస్తామన్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈవోతో సిట్ బృందం భేటీ
తిరుపతి (నేరవిభాగం), సెప్టెంబరు 29: తిరుపతిలోని టీటీడీ ఈవో క్యాంపు కార్యాలయంలో ఈవో శ్యామలరావును ఆదివారం సిట్ బృందం కలిసింది. గత ఐదేళ్లలో నెయ్యి కొనుగోళ్లలో జరిగిన టెండర్ల విధానం, అంతకుముందు ఎలా నెయ్యి కొనుగోలు చేశారు? ఇప్పటి వరకు ఏయే కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారు? రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిన నష్టం ఎంత? అనే వివరాలపై ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ ఎన్‌డీడీబీ నివేదిక బయటపెట్టిందని ఈవో వారికి వివరించినట్లు సమాచారం. కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని విభాగాల రికార్డులు తమకు అందచేయాలని సిట్ బృందం విజ్ఞప్తి చేసింది. దాదాపు గంట పాటు జరిగిన ఈ భేటీలో కల్తీ నెయ్యి వివాదం వెనుక ఉన్న కుట్ర కోణంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.