భరోసా ఇచ్చిన బడ్జెట్: పవన్
ABN , Publish Date - Nov 12 , 2024 | 05:00 AM
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రూ.1.3 లక్షల కోట్ల
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రూ.1.3 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ బడ్జెట్‌ను ఎంతో జాగ్రత్తగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి భరోసా కల్పించేలా రూపొందించారన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సోమవారం వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, జడ్పీటీసీ, కౌన్సిలర్లు పలువురు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటానని, తాను ఇచ్చే వ్యక్తినేగానీ తీసుకునే వ్యక్తిని కాదన్నారు. పార్టీకి బలమైన కార్యకర్తలు, ప్రజాదరణ ఉన్నాయన్నారు. టీడీపీ అనుభవం, బీజేపీ మద్దతు భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి మేలు కలగజేస్తాయన్నారు. కాగా, విజయవాడ, జగ్గయ్యపేట, పుంగనూరు, ధర్మవరం నియోజకవర్గాల నుంచి వైసీపీకి చెందిన పలువురు జనసేనలో చేరారు. వారిలో..విజయవాడ 16,48,51,38 డివిజన్ల కార్పొరేటర్లు, జగ్గయ్యపేట నుంచి యేసుపోగు దేవమణి, ధర్మవరానికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు.