Vijayawada : ఏసీబీ డీజీగా అతుల్ సింగ్
ABN , Publish Date - Jun 29 , 2024 | 04:18 AM
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఐడీ అధిపతిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్‌ను నియమించింది.
సీఐడీ బాధ్యతలు అయ్యన్నార్‌కు
విశాఖ పోలీస్ బాస్‌గా శంకబ్రత
సీనియర్ ఐపీఎ్‌సల బదిలీలు
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఐడీ అధిపతిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్‌ను నియమించింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్ చీఫ్ అతుల్ సింగ్‌ను ఏసీబీకి పరిమితం చేసింది. శాంతి భద్రతల ఏడీజీగా ఉన్న శంఖబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర డీజీపీగా నియమితులైన హరీశ్ కుమార్ గుప్తాను తప్పించి ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ.. ద్వారకా తిరుమలరావుకు ఇటీవలే పోస్టింగ్ ఇచ్చారు. ఏడీజీ ర్యాంకులో ఉన్న ముగ్గురు అధికారులకు శుక్రవారం పోస్టింగ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఐజీ, డీఐజీ, ఎస్పీల బదిలీలపై కసరత్తు చేస్తోంది. విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం రేంజ్ డీఐజీలతోపాటు రవాణా శాఖ కమిషనర్, డ్రగ్స్ కంట్రోల్ డీజీ, ఏసీబీ డైరెక్టర్ లాంటి పోస్టుల భర్తీ శనివారం పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం నాటికి పలు జిల్లాల ఎస్పీల బదిలీ, పోస్టింగ్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.