మేం అమెరికా పోలీసులం..
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:40 AM
హలో... మేం అమెరికా పోలీసులం. మీ అమ్మాయి ఇక్కడ ఉంటోంది కదా. ఆమె ట్రాఫిక్ నిబంధలు పాటించనందున రూ.లక్ష ఫైన్ కట్టాలి.
మీ అమ్మాయి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు
బెదిరించి లక్ష స్వాహా చేసిన మోసగాళ్లు
కలువాయి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘హలో... మేం అమెరికా పోలీసులం. మీ అమ్మాయి ఇక్కడ ఉంటోంది కదా. ఆమె ట్రాఫిక్ నిబంధలు పాటించనందున రూ.లక్ష ఫైన్ కట్టాలి. లేదంటే మీ అమ్మాయిని వదిలేది లేదు....’ అంటూ ఫోన్‌లో అవతల వ్యక్తి ఇంగ్లీషులో గంభీరంగా మాట్లాడటంతో ఆ తల్లిదండ్రులు గాభరా పడ్డారు. వెంటనే కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ కలవలేదు. దీంతో ఆందోళన చెందిన వారు భయంతో లక్ష రూపాయలు కట్టేశారు. నెల్లూరు జిల్లా కలువాయిలో శుక్రవారం సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడిన ఓ వ్యాపారి దీనగాథ ఇది. వివరాల్లోకి వెళితే.. కలువాయి బజారు వీధికి చెందిన ఓ వ్యాపారి కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ వ్యాపారికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము అమెరికా పోలీసులం అంటూ ఇంగ్లీషులో మాట్లాడారు. ‘మీ కుమార్తె ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు.
కాబట్టి భారత కరెన్సీ ప్రకారం లక్ష రూపాయిలు ఫైన్ కట్టాలి. ఇప్పుడు మీ అమ్మాయి మా ఆధీనంలోనే ఉంది’ అంటూ నమ్మించారు. ఆ వెంటనే మరో మహిళ ద్వారా వ్యాపారితో మాట్లాడించారు. ఇక్కడ తనను హింసిస్తున్నారని, వెంటనే డబ్బు కట్టాలని కుమార్తెలా మాట్లాడించారు. అదే సమయంలో వారు తమ కుమార్తెకు ఫోన్ చేయగా ఆ నంబర్ కలవలేదు. దీంతో భయపడిన వ్యాపారి సైబర్ నేరగాళ్లు తెలిపిన బ్యాంకు ఖాతాకు రూ.50 వేలు చొప్పున రెండు దఫాలుగా ట్రాన్స్‌ఫర్ చేశారు. కొద్ది సేపటికే కుమార్తె ఫోన్ కలవడంతో జరిగిన విషయం ఆమెకు తెలిపారు. అదేం జరగలేదని, తాను ఇంట్లోనే ఉన్నానని ఆమె చెప్పడంతో మోసపోయామని గ్రహించిన సదరు వ్యాపారి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.