Share News

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన పడవలు.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:40 PM

ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొట్టిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 5 పడవలు ఢీకొట్టినట్లు నిర్థారణ అయ్యింది. అందులో 3 అతి భారీ పడవలున్నాయి. ఇసుక తరలింపు కోసం ఉపయోగించే ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది.

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన పడవలు.. విచారణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొట్టిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 5 పడవలు ఢీకొట్టినట్లు నిర్థారణ అయ్యింది. అందులో 3 అతి భారీ పడవలున్నాయి. ఇసుక తరలింపు కోసం ఉపయోగించే ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. వరద సమయంలో పడవలను ఉద్దేశ్యపూర్వకంగానే సంరక్షించలేదని సమాచారం. అంత భారీ పడవలను కేవలం ప్లాస్టిక్ రోప్‌లతో కట్టి యజమానులు వదిలేశారు. వరద సమయంలో పడవలను గట్టిగా కట్టి ఉంచే ప్రయత్నం ఓనర్లు చేయలేదని విచారణలో తేలింది. వాస్తవానికి ఒక్కో పడవను విడివిడిగా కట్టాల్సి ఉన్నా...మూడు పడవలను కలిపి యజమానులు కట్టారు.


మూడు పడవులను కలిపి కట్టడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎవరూ ప్రశ్నించకుండా పడవలపై తమ పార్టీ రంగులను వేసుకున్నారు. ఉద్దండరాయుని పాలెం వైపు గట్టున ఉండే పడవలు... గొల్లపూడి వైపు తరలించడం జరిగింది. దీనిపై కూడా విచారణ నిర్వహిస్తున్నారు. వరద పెరుగుతోందని.. పడవుల వల్ల ప్రమాదం ఉందంటూ అధికారులు చేస్తున్న స్థానికుల హెచ్చరికలను యజమానులు పట్టించుకోలేదు. మూడు పడవలు తెగి.. మరో రెండు పడవలను తాకడంతో మొత్తం 5 పడవులు బ్యారేజ్‌ను ఢీ కొట్టినట్లు అధికారులు గుర్తించారు. కౌంటర్ వెయిట్ కాకుండా.. బ్యారేజ్ పిల్లర్లకు తగిలి ఉంటే అతి భారీ నష్టం జరిగేదని అధికారులు అంటున్నారు.


నిందితులు ఉషాద్రి, రామ్మోహన్‌లు ఇద్దరూ ఎమ్మెల్సీ తలసి రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించడం జరిగింది. నిందితుల కాల్ డేటా.. కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ప్రమాదం, నిర్లక్ష్యం కాదని.. కుట్ర ఉందని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొట్టిన ఘటన ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. భారీ పడవలను ప్లాస్టిక్ తాళ్లతో కట్టేయడం... మూడు పడవులను కలిపి కట్టడం వంటి విషయాలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. విచారణ పూర్తైతే కానీ అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Updated Date - Sep 09 , 2024 | 12:45 PM