Share News

Budameru: బుడమేరు ఉగ్రరూపం.. 30 ఏళ్లలో తొలిసారిగా..

ABN , Publish Date - Sep 04 , 2024 | 01:35 PM

కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. గత 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు

Budameru: బుడమేరు ఉగ్రరూపం.. 30 ఏళ్లలో తొలిసారిగా..

గుడివాడ: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం బుడమేరుకు వచ్చి చేరుకుంటోంది. గత 30 ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చొచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం ఉంది. కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఒడ్డుకు చేరుస్తున్నారు.


3 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. పలు చోట్ల చేపల చెరువులకు గండ్లు పడ్డాయి. పుట్టగుంట వద్ద బుడమేరు వరద ఉధృతిని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో బోట్ల ద్వారా ముంపు బాధిత ప్రజలకు టీడీపీ నేతలు ఆహారాన్ని అందిస్తున్నారు. బుడమేరు నీటి ఉధృతిపై అధికారులతో కలెక్టర్ బాలాజీ సమీక్షించారు. బస్సులు, పడవల ద్వారా ప్రజలంతా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కలెక్టర్ బాలాజీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో ప్రజలందరూ సహకరించాలని కోరారు.


మరోవైపు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నారా లోకేష్ సైతం వెంటనే రంగంలోకి దిగారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. 200 మీటర్ల మేర గండ్లు పడడంతో కవులూరు, ఈలప్రోలు రాయనపాడు, సింగినగర్ మీద బుడమేరు విరుచుకుపడింది. వరద ఉధృతి తగ్గడంతోఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు. ఇక్కడ గండ్లను పూడ్చుతుంటే నందివాడ ప్రాంతంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చుతోందన్న వార్తలతో అటు ప్రజల్లోనూ.. ఇటు అధికారుల్లోనూ ఆందోళన ప్రారంభమైంది.

Updated Date - Sep 04 , 2024 | 01:35 PM