Share News

వైసీపీ అక్రమాలపై బుల్డోజర్‌!

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:13 AM

రాష్ట్ర జలవనరుల శాఖ భూముల స్వాహాకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. అనుమతుల్లేకుండా భూమిని స్వాధీనం చేసుకుని.. అందులో అడ్డగోలుగా ఆ పార్టీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో శనివారం

వైసీపీ అక్రమాలపై బుల్డోజర్‌!

విశాఖ, అనకాపల్లి వైసీపీ ఆఫీసులకూ నోటీసులు

17 ఎకరాల బోటుయార్డు భూముల స్వాహాకు కుట్ర

పార్టీ ఆఫీసు కోసం రెండెకరాలు కేటాయిస్తూ జీవో

ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ

అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు

కార్పొరేషన్‌ అనుమతి, సీఆర్‌డీఏ పర్మిషన్లూ లేవు

దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ

హైకోర్టులో వైసీపీ పిటిషన్‌.. లభించని ఊరట

చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం

చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత

జగన్‌ హయాంలోనే అక్రమ నిర్మాణంపై నోటీసులు

అయినా ఇవ్వలేదంటూ మాజీ సీఎం అబద్ధాలు

రాజధానికి రోడ్డు లేకుండా చేసేందుకే ఆ భూములపై కన్ను

జలవనరులు, కుంటల్లో నిర్మాణాలు కూడదని, ఆ భూమి

ఇవ్వొద్దని నాడు ఈఎన్‌సీ నివేదిక.. అయినా కేటాయింపు

ఇప్పుడు నోటీసులకు స్పందించనందుకే కూల్చివేత

దీనిని చంద్రబాబుకు ఆపాదిస్తూ జగన్‌ రాజకీయం

మంగళగిరి, జూన్‌ 22: రాష్ట్ర జలవనరుల శాఖ భూముల స్వాహాకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. అనుమతుల్లేకుండా భూమిని స్వాధీనం చేసుకుని.. అందులో అడ్డగోలుగా ఆ పార్టీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి పాత, కొత్త హైవేల నడుమ జలవనరుల శాఖకు సర్వే నంబరు 202-ఏలో అత్యంత ఖరీదైన 17.03 ఎకరాల భూమి (తాడేపల్లి బోటు యార్డు స్థలం) ఉంది. ఇక్కడ ఎకరా విలువ రూ.25 కోట్ల వరకు ఉంది. దీనిని హస్తగతం చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం పెద్ద పథకమే వేసింది. 17.03 ఎకరాల్లో రెండెకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయ భవనం కోసమంటూ నిరుడు ఫిబ్రవరి 16న జీవో 52 విడుదల చేయించుకుంది. ఇరిగేషన్‌ భూముల్లో ఎలాంటి కాంక్రీటు నిర్మాణాలు చేపట్టరాద ని నిబంధనలు చెబుతుండగా.. వాటన్నిటినీ తోసిరాజని గుంటూరు జిల్లా కలెక్టర్‌, తాడేపల్లి మండల తహసీల్దారు సదరు బోటు యార్డు భూమిలో రెండెకరాలను వైసీపీకి కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చారు. వీటికి అనుగుణంగా వైసీపీకి భూమిని బదలాయిస్తూ జలవనరుల శాఖ స్వాధీనపు ఉత్తర్వులను ఇవ్వాల్సి ఉండగా ఆ శాఖ అధికారులు అందుకు అంగీకరించలేదు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ సదరు స్థలంలో హడావుడిగా కాంక్రీటు నిర్మాణాలను మొదలుపెట్టింది. వాస్తవంగా కేటాయించింది రెండెకరాలే అయినా.. మిగిలిన 15 ఎకరాలనూ స్వాహా చేయాలన్నది అసలు ఎత్తుగడ. ఎకరం రూ.25 కోట్లకు పైగా విలువ చేసే 17 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాల లీజు(ఎకరాకు ఏడాదికి రూ.వేయి వంతున.. అది కూడా రెండెకరాలకు మాత్రమే) పేరిట స్వాఽధీనం చేసుకోవాలనుకుంది. నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) కూడా లేకుండా.. బోటు యార్డు స్థలంలో ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టింది. ఈ అక్రమ నిర్మాణాన్ని ఆ ప్రాంత సచివాలయ సిబ్బంది గత నెల 20న గుర్తించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అదేరోజున తక్షణమే నిర్మాణాలను నిలిపివేసి అనుమతులకు సంబంధించి తగు వివరణ ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధిష్ఠానానికి ప్రొవిజినల్‌ ఆర్డర్స్‌ ఇచ్చామని కార్పొరేషన్‌ కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌ శనివారం తెలిపారు. ‘నోటీసులకు ఆ పార్టీ స్పందించకపోవడంతో తిరిగి ఈ నెల 1న సదరు అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించరాదో చెప్పాలంటూ కన్ఫర్మేషన్‌ నోటీసులు కూడా ఇచ్చాం. వాటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో తిరిగి ఈ నెల 14న సదరు అక్రమ నిర్మాణాలను 24 గంటల్లోగా స్వచ్చందంగా తొలగించాలని.. లేకుంటే మేమే రంగంలోకి దిగి వాటిని సమూలంగా కూల్చివేసి...అందుకైన ఖర్చులను వారిపైనే వేస్తామంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశాం. అయినప్పటికీ వైసీపీ అధిష్ఠానం ఉలుకూపలుకూ లేకుండా నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించింది’ అని వెల్లడించారు. ఈలోగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(ఏపీసీఆర్‌డీఏ) కూడా ఈ నెల 10న సదరు అక్రమ నిర్మాణాలకు సంబంఽధించిన ప్రొవిజనల్‌ ఆర్డర్స్‌ను, ఈ నెల 21న కన్ఫర్మేషన్‌ ఆర్డర్స్‌ను జారీ చేసినట్లు సమాచారం. సీఆర్‌డీఏ ఇచ్చిన కన్ఫర్మేషన్‌ ఉత్తర్వులపై వైసీపీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన కోర్టు.. చట్ట బద్ధంగా వ్యవహరించాలని సీఆర్‌డీఏను ఆదేశించినట్లు తమకు సమాచారం అందిం దని కమిషనర్‌ తెలిపారు. తాము నెల రోజుల నుంచి నియమ నిబంధనల ప్రకారం నడుచుకున్న తర్వాత చట్టబద్ధంగా శనివారం తెల్లవారుజామున అక్రమ నిర్మాణాలను తొలగించామన్నారు.


సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును అడ్డుకునేందుకే!

అమరావతిని సర్వనాశనం చేసి ఇక్కడ రాజధాని అనేది లేకుండా చేయాలన్నది వైసీపీ అధిష్ఠానం ఉద్దేశం. ఈ ఆలోచనకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా తాడేపల్లి బోటు యార్డు స్థలంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాలని ఎత్తుగడ వేసింది. ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవచ్చు. కనకదుర్గ వారధి-మణిపాల్‌ హాస్పిటల్‌ వద్ద నుంచి 16వ నంబరు జాతీయ రహదారిని రాజధాని అమరావతికి అనుసంధానించేందుకు ఈ సీడ్‌ యాక్సిస్‌ రోడ్డే ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు తాలూకు ఫ్లైఓవర్‌ తాడేపల్లి బోటు యార్డు మీదుగా వెళ్లాలి. సరిగ్గా ఇక్కడ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును అడ్డుకోవచ్చు. అందుకే ఆ పార్టీ ఈ స్థలాన్ని ఎంచుకుంది.

బాబు కక్ష సాధింపులకు దిగారు: జగన్‌

తాడేపల్లిలో భవనాన్ని కూల్చివేయడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులకు దిగారని ఆరోపించారు. ‘దాదాపు పూర్తికావచ్చిన మా పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు.. ఈ ఘటన ద్వారా వచ్చే ఐదేళ్ల పాలన ఏవిధంగా ఉండబోతోందో హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులు, కక్షసాధింపు చర్యలకు మా పార్టీ తలొగ్గేది లేదు. వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 23 , 2024 | 05:13 AM