High Court: జత్వానీపై కేసు.. గత సీఎంవో కుట్ర
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:59 AM
సినీనటి కాదంబరి జత్వానీపై కేసు నమోదు, అరెస్టుకు సంబంధించి గత ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వేదికగానే కుట్ర జరిగిందని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.
పోలీసు ఉన్నతాధికారులు భాగస్వాములు
పిటిషనర్లు పోలీసు ఉన్నతాధికారులు
బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్
నిందితురాలే కేసు పెడితే ఎలా: పిటిషనర్లు
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సినీనటి కాదంబరి జత్వానీపై కేసు నమోదు, అరెస్టుకు సంబంధించి గత ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వేదికగానే కుట్ర జరిగిందని అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ శుక్రవారం హైకోర్టుకు తెలిపారు. కుట్రలో పోలీసు ఉన్నతాధికారులు భాగస్వాములు అయ్యారన్నారు. ‘‘కుక్కల విద్యాసాగర్ నుంచి ఫిర్యాదు అందకముందే జత్వానీని కేసులో ఇరికించేందుకు పోలీసులు ఉన్నతాధికారులు ప్రణాళిక రచించారు. విజయవాడ డీసీపీగా పనిచేస్తూ విశాఖకు బదిలీ అయిన విశాల్ గున్నీని రిలీవ్ చేయకుండా జత్వానీ కేసును పర్యవేక్షించేందుకు ముంబైకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే రిలీవ్ చేస్తామని గున్నీకి అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రాణా తాతా స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘం ముందు విశాల్ గున్నీ ఇచ్చిన వాంగ్మూలం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సీఎంవో స్థాయిలో జరిగిన కుట్రను వెలికితీసేందుకు పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది.
ఫోర్జరీ డాక్యుమెంట్‌తో జత్వానీ తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు. అదే రోజు ఉదయం 6 గంటలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందడానికి ఒకరోజు ముందే పోలీసులు ముంబైకి వెళ్లేందుకు వీలుగా టికెట్లు బుక్ చేయాలని అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా.. తన క్యాంప్ క్లర్క్‌ను ఆదేశించారు. కేసు నమోదయ్యే సమయానికి ముంబైకి వెళ్లేందుకు ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, ఇతర పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జత్వానీని కేసులో ఇరికించేందుకు పిటిషనర్లు కుట్ర చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. మధ్యంతర ఉత్తర్వుల కారణంగా పిటిషనర్లను అదుపులోకి తీసుకుని కుట్రకోణాన్ని వెలికి తీయలేకపోయాం. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. నకిలీ డాక్యుమెంట్ ఎవరు సృష్టించారు? జత్వానీపై కేసు నమోదు వెనుక ఎవరున్నారు? ఎవరి పాత్ర ఏమిటి? అనేవి వెలికితీసేందుకు పిటిషనర్ల కస్టోడియల్ విచారణ అవసరం. పిటిషనర్ల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని ఏజీ కోరారు.
గతంలో ఇలా లేదు: జత్వానీ
జత్వానీ తరఫు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇలాంటి కేసు నమోదు కాలేదు. నిఘా విభాగాధిపతి డీజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారి నుంచి కానిస్టేబుల్ వరకు నేరంలో భాగస్వాములయ్యారు. జత్వానీపై కేసు నమోదు చేయడంలో అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులది కీలకపాత్ర. ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే జత్వానీని అరెస్ట్ చేసి రాష్ట్రానికి తెచ్చేందుకు పోలీసులు ముంబైకి వెళ్లారు. కేసులో నిందితులుగా ఉన్న ప్రతి అధికారి పాత్ర గురించి ప్రాథమిక ఆధారాలున్నాయి’’ అని కోర్టుకు తెలిపారు. శుక్రవారం కోర్టు సమయం ముగియడంతో బాధితురాలు జత్వానీ తరఫు వాదనలు కొనసాగింపు, పిటిషనర్ల తరఫు రిప్లై వాదనల కోసం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్‌గున్నీ, అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతురావు, దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది వెంకటేశ్వర్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి.
ఆమె పెట్టిన కేసు చెల్లదు: పిటిషనర్లు
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, పట్టాభి, వినోద్‌కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘‘నకిలీ డాక్యుమెంట్‌తో భూమిని విక్రయించేందుకు ప్రయత్నించారని జత్వానీపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఆ కేసు విచారణను పూర్తిచేసిన పోలీసులు.. చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. నిందితురాలిగా ఉన్న జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులపై కేసు పెట్టారు. ఇది చెల్లుబాటు కాదు. ఒకే అంశంపై నమోదైన కేసు విచారణ పూర్తికాకుండా రెండో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి వీల్లేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి’’ అని కోర్టుకు వివరించారు.