పోలవరానికి నాలుగు అడ్డంకులు
ABN , Publish Date - Oct 20 , 2024 | 04:43 AM
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌లో కీలక కట్టడాలైన డయాఫ్రమ్‌వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణంపై ప్యానల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్(పీవోఈ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన అధ్యయన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది.
వాటిని అధిగమించేలా నిర్మాణ ప్రణాళికలు అమలు చేయాలి
అప్పుడే సకాలంలో పనులు పూర్తి చేయడం సాధ్యపడుతుంది
పీవోఈ, సీడబ్ల్యూసీ నివేదికలను పరిగణనలోకి తీసుకోండి
రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం
రేపు నిర్మాణసంస్థలతో నిమ్మల సమీక్ష
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌లో కీలక కట్టడాలైన డయాఫ్రమ్‌వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణంపై ప్యానల్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్(పీవోఈ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన అధ్యయన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. పోలవరం నిర్మాణంలో నాలుగు అంశాలు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని సీడబ్ల్యూసీ, పీవోఈ ఉమ్మడిగా వెల్లడించాయి. వీటిని అధిగమించేలా నిర్మాణ ప్రణాళికలను అమలు చేస్తే సకాలంలో పనులు పూర్తి చేయవచ్చని రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల స్పష్టం చేసింది.
కాఫర్‌డ్యామ్ బట్రెస్ లెంగ్త్: ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు జలాలు ఎగజిమ్మడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. సీపేజీని అరికట్టేందుకు సాంకేతిక నైపుణ్యాలను పునఃసమీక్ష చేయాల్సి ఉంది. నివారణ చర్యలు చేపట్టడం కోసం మట్టి, రాళ్లతో కూడిన ప్రత్యేక డిజైన్లను రూపొందించాల్సి ఉంది.
వైబ్రో కాలమ్స్‌తో గ్రౌండ్ క్లియరెన్స్: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య నిర్మించనున్న డయాఫ్రమ్‌వాల్ ప్రాంతంలో గ్రౌండ్ క్లియరెన్స్ కోసం వైబ్రో కాలమ్స్ ఉపయోగించి బురద నియంత్రణ చర్యలు చేపట్టాలి.
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ ప్రణాళిక: డయాఫ్రమ్‌వాల్ నిర్మాణాన్ని పునఃపరిశీలన చేయాలి. గతంలో నిర్మించిన దానికి, కొత్తగా నిర్మిస్తున్న దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా విశ్లేషించుకోవాలి. దీని నిర్మాణం ఒక క్రమ విధానంలో.. ఒకదాని వెంట ఒకటిగా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దీనికిగాను పీవోఈ, సీడబ్ల్యూసీ సూచనలను, విశ్లేషణలు, అధ్యయన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.
కాఫర్ డ్యామ్‌ల మధ్య నీటి నిల్వ: డయాఫ్రమ్‌వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ల నిర్మాణ సమయంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నీటి నిల్వలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. కాఫర్ డ్యామ్‌ల నుంచి ఎగదన్నుకొస్తున్న జలాలను నిరంతరం పంపింగ్ చేస్తూ బయటకు పంపేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రేపు మంత్రి నిమ్మల సమీక్ష
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు వచ్చేనెల నుంచి ప్రారంభించడంపై సోమవారం జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌తో కలసి మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షిస్తారు. నిర్మాణ సంస్థలు మేఘా, బావర్ ప్రతినిధులతో సహా పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు నరసింహమూర్తి తదితరులు పాల్గొంటారు. సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని, వచ్చేనెల 5నుంచి 9 వరకూ ప్రాజెక్టు ప్రాంతంలో వర్క్‌షాప్ నిర్వహించాలని మంత్రి స్పష్టం చేయనున్నారు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబుకు నివేదిస్తారు.