Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:02 PM
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే లైన్ కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఈ నిర్ణయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గురువారం న్యూఢిల్లీలో స్పందించారు. ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కల నిజమవుతున్న రోజు.. ఈ రోజు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ముగ్గురిపై నమ్మకం పెట్టుకున్నారన్నారు. వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆయన వివరించారు.
ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ గురువారం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కనెక్టివిటీ అత్యంత కీలకమైన అంశమని ఆయన గుర్తు చేశారు. అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణ, రవాణా సదుపాయాల మరింత పెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 రోజుల్లోనే క్యాబినెట్ ముందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీసుకు వచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న సంక్షోభానికి ఈ తరహా వేగవంతమైన నిర్ణయాలు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయంలోగా పూర్తవుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15 వేల కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఎన్నికల ప్రచారంలో సైతం ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజధాని అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం..కేంద్ర బడ్జెట్‌లో సైతం ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో అధిక నిధులు వెచ్చించింది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరపకుండా గతంలో వలే.. ఆ సంస్థ పని చేసుకునే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ చర్చ సైతం సాగుతుంది. ఇక విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు సైతం వేగవంతమైనాయి.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనపై అన్ని ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో రాజధాని ప్రాంత ప్రజలు దాదాపు ఐదేళ్ల పాటు దీక్షలు,నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఇక 2024 ఎన్నికల్లో ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో.. రాష్ట్రానికే కాదు.. రాజధాని అమరావతికి సైతం కొత్త కళ వచ్చినట్లు అయింది. అలాగే రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కూడా ఊపందుకున్నాయి.
For AndhraPradesh News And Telugu News..