Share News

చంద్రబాబు : బాధ్యులపై కఠిన చర్యలు

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:05 AM

తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడిసరుకులు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పరిశీలించి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చంద్రబాబు : బాధ్యులపై కఠిన చర్యలు

  • గత ప్రభుత్వంలో తిరుమల అపవిత్రం

  • భక్తుల మనోభావాలను దెబ్బతీశారు

  • జంతు సంబంధిత పదార్థాలు ఏవి

  • వాడారో నివేదికలు చెబుతున్నాయి

  • ప్రక్షాళన ప్రారంభించాం: చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడిసరుకులు వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ పరిశీలించి, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రసాదంలో జంతు సంబంధిత పదార్థాలు ఏవి వాడారనేది నివేదికలు నిర్దిష్టంగా చెప్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో భక్తులకు నాసిరకం భోజనం పెట్టి, తిరుమల తిరుపతి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. గురువారం అమరావతి సచివాలయ ప్రాంగణంలో అన్న క్యాంటీన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి హిందువులకు కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి పవిత్రమైన తిరుమలను గత ప్రభుత్వం పూర్తిగా అపవిత్రం చేసింది. ఎన్టీరామారావు తిరుమలలో భక్తులకు అన్న ప్రసాదం అందించే కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పవిత్రమైన దేవాలయంలో అపవిత్రమైన ముడిసరుకులు వాడారు. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో నాకర్థం కావట్లేదు.

తిరుమల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించాం. అన్న ప్రసాదానికి భక్తులు, దాతలు విరాళాలిస్తున్నారు. వేంకటేశ్వరస్వామికి ఎవరైనా అపచారం తలపెడితే ఈ జన్మలో కాకపోతే.. తర్వాత జన్మలోనైనా శిక్ష తప్పదు. చివరికి వేంకటేశ్వరస్వామిని తీసుకెళ్లి, పెళ్లిళ్లులో ఊరేగించే పరిస్థితికొచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం సరికాదు. ఆధారాలు దొరికాక అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయి. ప్రసాదంలో జంతు సంబంధ పదార్థాలు ఏవి వాడారనేది నివేదికలు నిర్దిష్టంగా చెప్తున్నాయి. దీంతో కొంతమంది పారిపోయారు. కొందరిని తప్పించి, పవిత్రమైన నెయ్యి తెచ్చాం.

నాణ్యత పెరగడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని అన్నారు. కాగా, రాష్ట్రంలో పేదల కడుపు నింపడానికి పెట్టిన అన్న క్యాంటీన్లకు దాతలు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అన్నక్యాంటీన్‌ అంటే సేవాభావానికి స్ఫూర్తినిచ్చే కేంద్రం కావాలన్నారు. ఇప్పటికే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, ఇప్పుడు మరో 75 ప్రారంభిస్తున్నామని తెలిపారు. ‘అన్నక్యాంటీన్లను గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా రద్దు చేసింది. మా ప్రభుత్వంలో 203 అన్నక్యాంటీన్లు పెట్టాలని నిర్ణయించాం. దేశంలో రోజూ 22లక్షల మందికి అక్షయపాత్ర సంస్థ భోజనం పెడుతోంది. అక్షయపాత్రకు ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. దాతలిస్తున్నారు. సేవాభావంతో పనిచేసే సంస్థను విమర్శించడం దుర్మార్గం’ అని విమర్శించారు. తొలుత పేదలకు సీఎం స్వయంగా భోజనం వడ్డించారు.

Updated Date - Sep 20 , 2024 | 04:05 AM