Share News

Chandrababu : 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:51 AM

రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు అమలుచేసి ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Chandrababu : 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం

కొత్త ఆవిష్కరణలు,ఆలోచనలకు వేదికగా ఏపీ

నాడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

నేడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదం

వనరులతోపాటు కొత్త పాలసీలూ ఉన్నాయి

కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి

విజన్‌ 2047 భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు అమలుచేసి ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అవకాశాల కల్పనతో సంపద సృష్టి సాధ్యమవుతుందని, అలా వచ్చిన సంపదను పేదవర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చని తెలిపారు. 2014-19 టీడీపీ హయాంలో 13.5 శాతం వృద్ధిరేటు సాధించామని, ప్రస్తుతం 15 శాతం వృద్ధిరేటు సాధించగలమన్న ధీమాను చంద్రబాబు వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌ - 2047పై సచివాలయంలో సోమవారం పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. విజన్‌ - 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం మేధోమథనం చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కోచైర్మన్‌గా టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రమంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్స్‌గా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి.

ఏపీలో సహజవనరులు, మానవవనరులు, మౌలిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు మేం వేదికగా ఉండాలనుకుంటున్నాం. నాడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడాం, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడున్నామని సీఎం అన్నారు. ’నాడు ఒక ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలన్న లక్ష్యంతో పనిచేశాం. నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం’ అని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, వీటికితోడు ఉత్తమమైన పాలసీలు కూడా ప్రకటించామన్నారు. ఈ సమావేశంలో టాటాసన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జిఎం రావు, ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌, టీవీఎస్‌ కంపెనీ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరామల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరామల్‌, రెడ్డి ల్యాబోరేటరీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, ఇతర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 04:51 AM